Begin typing your search above and press return to search.

ఆ పార్టీ కంటే బావిలో దూకడం నయం... గడ్కరీ సంచలనం

By:  Tupaki Desk   |   29 Aug 2022 8:57 AM GMT
ఆ పార్టీ కంటే బావిలో దూకడం నయం... గడ్కరీ సంచలనం
X
బీజేపీ అగ్ర నేత. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటనకు మారుపేరుగా మారిపోయారు. ఆయనను మోడీ షా ద్వయం బీజేపీలో ఎంతలా టార్గెట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అయినా సరే గడ్కరీ తాను ఎక్కడా తగ్గేదే లేదు అని అంటున్నారు. ఆయన ఆరెస్సెస్ భావజాలం నిండా నింపుకున్న వారు. ఇక ఒకరికి భయపడి తన భావజాలాన్ని దాచుకోవడం ఆయన వల్ల కాదు, అందుకే కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతారు.

ఆ విధంగానే ఆయన తాజాగా అంటే వారంతంలో నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తన మనసులో మాటను పంచుకున్నారు. తాను విద్యార్ధిగా ఉండగా చురుకుగా ఉండేవాడినని అయితే ఏ రాజకీయ పార్టీని ఎంచుకోవాలి అన్నపుడు తన స్నేహితుడు కాంగ్రెస్ లో చేరమని సలహా ఇచ్చాడని గడ్కరీ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అయితే తనకు ఆ పార్టీ సిద్ధాంతాలు అసలు పడవని ఆయన చెప్పేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం మంచిదని కూడా నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారుట. ఆ సలహా ఇచ్చిన స్నేహితుడు పేరు రు శ్రీకాంత్ జిచ్కార్ అని గడ్కరీ చెప్పడం విశేషం. ఆరెస్సెస్ భావజాలం తో పెరిగిన గడ్కరీ కి కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చవు. అయితే మాత్రం ఆ పార్టీలో చేరడం కన్నా బావిలో పడి చనిపోవడమే నయం అని ఆయన అంతటి కఠినమైన మాటను వాడడం కూడా చర్చగా ఉంది.

ఒక వైపు ఆయన ఇందిరాగాంధీ సమర్ధత‌ను పొగిడిన సందర్భం ఉంది. మహాత్ముడు రాజకీయాలు చేయలేదని, సేవ చేశారని కూడా ఆయన అంటారు. దేశంలో కాంగ్రెస్ లాంటి గట్టి పార్టీ ప్రతిపక్షంలో ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడతారు. కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే మాత్రం తనకు ఎంతమాత్రం పడదని అంటారు. ఇక నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఇటీవలే తప్పించారు.

ఆ బోర్డులో సభ్యుల సంఖ్యను ఏడు నుంచి పదకొండుకు పెంచినా కూడా గడ్కరీని తప్పించడం అంటే ఆయన అంత బరువు అయిపోయారా లేక ఎవరికి కన్నెర్ర అయిపోయారు అంటే దీనికి జవాబు ఈజీనే. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే మోదీ స్థానంలో అటు బీజేపీలోనూ ఇటు మిత్రులలోనూ గడ్కరీయే ప్రధాని క్యాండిడేట్ అవుతారు. దాంతో ముందుగానే దీన్ని గమనించి ఆయన్ని బోర్డు నుంచి సాగనంపారని అంటున్నారు.

అయితే దీని మీద కూడా గడ్కరీ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం ఒకరిని ఉపయోగించుకుని వదిలేస్తే రేపటి రోజున అదే పరిస్థితి మనకూ ఎదురు అవుతుందని ఆయన సున్నితంగా హెచ్చరించడం ఎవరి గురించో అందరికీ అర్ధమైపోయింది. మొత్తానికి గడ్కరీ తాను కరడు కట్టిన ఆరెస్సెస్ కార్యకర్తను అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ విధానాలను తుదికంటా వ్యతిరేకిస్తున్నాను అని చెబుతున్నారు. అదే టై, లో తాను బీజేపీలో వ్యక్తిపూజలకు దూరం అని యూజ్ అండ్ త్రో పాలసీ చేసేవారికి చెడ్డ రోజులు తప్పవని కూడా చెబుతున్నారు. సో మోడీ వర్సెస్ గడ్కరీ ఎపిసోడ్ లో ముందు ముందు మరిన్ని సంచలనాలు ఉన్నాయనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.