Begin typing your search above and press return to search.

బీజేపీ అధిష్టానానికి ఆ అంశాలపై కన్నా ఫిర్యాదు చేశారా?

By:  Tupaki Desk   |   29 Jan 2023 12:06 PM GMT
బీజేపీ అధిష్టానానికి ఆ అంశాలపై కన్నా ఫిర్యాదు చేశారా?
X
ఊహించని పరిణామంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ నేత శివప్రకాష్‌ను కలిశారు. న్యూఢిల్లీలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు, భీమవరంలో రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశాలకు కన్నా దూరంగా ఉంటున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నేతతో కన్నా జరిపిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కన్నా లక్ష్మీనారాయణ, శివ ప్రకాష్‌ల సమావేశం దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగింది. కాగా మీడియా వార్తలను బట్టి కన్నా ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ సోముపై శివ ప్రకాష్‌కు తాను ఫిర్యాదు చేయలేదని తెలపడం విశేషం.

అలాగే తాను జనసేనలో చేరడం లేదని కన్నా స్పష్టం చేశారు, అయితే మీడియా తనపై నిరాధారమైన కథనాలను కొనసాగిస్తోంది అని కన్నా మండడిపడ్డారు. నాదెళ్ల మనోహర్‌ తనకు మంచి స్నేహితుడు అని తన స్నేహితుడిని కలవడం నేరమా?‘ అని కన్నా ఎదురుప్రశ్నించడం గమనార్హం.

ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు ఉన్నారని, కానీ వారికి పార్టీ నుంచి తగిన గుర్తింపు రావడం లేదని పరోక్షంగా సోమును ఉద్దేశించి కన్నా వ్యాఖ్యానించారు. శివప్రకాష్‌తో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించానని తెలిపారు. అయితే చాలా మంది నేతలు పార్టీని వీడడం మంచి సంకేతం కాదని కన్నా వెల్లడించారు.

కాగా చాలా కాలంగా ఏపీ బీజేపీలో పరిస్థితులు బాగోని సంగతి తెలిసిందే. నేతల మధ్య విభేదాలు రాకుండా చేసేందుకు బీజేపీ హైకమాండ్‌ ప్రయత్నించినా ఫలించడం లేదు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల తన హయాంలో నియమించిన 8 మంది జిల్లాల అధ్యక్షులను మార్చడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలోని వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. కన్నా లక్ష్మీనారాయణతో చర్చించాలని బీజేపీ జాతీయ కార్వనిర్వాహక కార్యదర్శి శివ ప్రకాష్‌ జీని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణతో శివ ప్రకాష్‌ జీ ఫోనులో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను విజయవాడ వస్తున్నానని.. అక్కడ అన్ని విషయాలు తెలుసుకుంటానని కన్నాకు హామీ ఇచ్చారు.

కన్నాకు హామీ ఇచ్చినట్టుగానే శివ ప్రకాష్‌ జీ.. కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, నాయకుల పనితీరుని శివ ప్రకాష్‌ జీకి కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలను ఆయనకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కన్నా ఖండించారు.