హాట్ టాపిక్.. చింతలకు పాజిటివ్ షాక్ తగిలిందెలా?

Tue Jun 02 2020 09:30:58 GMT+0530 (IST)

BJP Leader Chintala Ramachandra Reddy Tests Positive Dangerous Disease

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే.. బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఆయనకు.. ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ గా తేలటం పలువురిని విస్తుపోయేలా చేసింది. దీనికి కారణం లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. తనను ఓడించిన నియోజకవర్గ ప్రజల్ని కష్టకాలంలో మర్చిపోకుండా భారీ ఎత్తున సాయం చేయటమే కారణం. లాక్ డౌన్ వేళ.. ఇబ్బంది పడుతున్న వారికి సహాయ సహకారాలు అందించటం.. వారికి అవసరమైన నిత్యవసర వస్తువుల్ని పెద్ద ఎత్తున ఆయన అందించారు.గ్రేటర్ పరిధిలోని చాలామంది ఎమ్మెల్యేలతో పోలిస్తే.. చింతల యాక్టివ్ గా ఉండటమే కాదు.. సాయం కోసం వచ్చిన వారికి కాదనకుండా చేసేవారన్న పేరుంది. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయకపోతే.. విడి రోజుల్లో చేస్తామా? అన్నట్లుగా వ్యవహరించే మంచి మనిషికి పాజిటివ్ రావటం ఏమిటన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే స్థాయిరాజకీయ నేతకు పాజిటివ్ రావటం చింతలతోనే షురూ అయ్యిందని చెప్పాలి.

ఇంతకీ ఆయనకు ఎలా టచ్ అయి ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే.. చింతల అప్రమత్తంగా ఉండేవారు. లాక్ డౌన్ వేళ.. నిత్యవసర సామాన్ల పంపిణీ కోసం ఆయన అనుసరించిన విధానం అప్పట్లో మీడియాలో ప్రముఖంగా పబ్లిష్ అయ్యింది. పీపీఈ సూట్ ధరించి మరీ సాయం చేసేవారు. చాలా జాగ్రత్తలు తీసుకునే ఆయనకు పాజిటివ్ రావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

సహాయక చర్యల్లో భాగంగా దూకుడుగా వ్యవహరించటం.. వివిధ ప్రాంతాలకువెళ్లి రావటం కూడా పాజిటివ్ రావటానికి కారణంగా చెబుతున్నారు. చింతలకు పాజిటివ్ కన్ఫర్మ్ కావటం పై స్పందిస్తున్న పలువురు.. సాయం చేయటమే పాపమైందా? అని వ్యాఖ్యానించటం గమనార్హం. చాలామంది నేతల మాదిరి సాయం చేయకుండా తనకు తానుగా ఉండిపోతే.. ఈ రోజున ఇలాంటి తిప్పలు ఎదురయ్యేది కాదన్న మాట వినిపిస్తోంది.