Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బాటలోనే బీజేపీ

By:  Tupaki Desk   |   16 May 2022 2:30 AM GMT
కాంగ్రెస్ బాటలోనే బీజేపీ
X
ఉదయం లేచింది మొదలుకుని రాత్రినిద్రపోయేంత వరకు కాంగ్రెస్ ను తిడుతుండే బీజేపీ చివరకు ఒక విషయంలో అదే కాంగ్రెస్ ను అనుసరిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ముఖ్యమంత్రులను తరచూ మార్చటంలో కాంగ్రెస్ కు పెద్ద చరిత్రే ఉంది. ఇపుడు అదే బాటలో బీజేపీ కూడా నడుస్తోంది. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ తో రాజీనామా చేయించింది. ఉపముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను సీఎంగా కూర్చోబెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మామూలుగా అయితే తరచూ సీఎంలను మార్చుతుంటే జనాల్లో పార్టీ చులకనైపోతుంది. గతంలో ఇలాంటి పనులు చేసే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గబ్బుపట్టిపోయింది. అలాంటిది ఇపుడు బీజేపీ కూడా అదేదారిలో వెళుతోంది. విచిత్రం ఏమింటే ఉత్తరాఖండ్ లో బీజేపీకి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధిష్టానం ముగ్గురు సీఎంలను మార్చింది. అయితే మొన్ననే జరిగిన ఎన్నికల్లో అంతకుముందుకన్నా ఎక్కువ సీట్లు సాధించటం గమనార్హం.

ముఖ్యమంత్రుల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందికాబట్టే మార్చాల్సొచ్చిందని అధిష్టానం తన చర్యలను సమర్ధించుకున్నది. ఇదే పద్దతిని కర్నాటకలో కూడా అనుసరిస్తోంది. ఇక్కడ ఏమవుతుందో వచ్చే ఏడాది తేలిపోతుంది. ఇదే పద్దతిలో త్రిపురలో మొదలుపెట్టింది. వచ్చే ఏడాదిలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సమయంలో విప్లవ్ మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నట్లు అధిష్టానానికి సమాచారం అందింది.

దాంతో విషయాలపై విచారించుకున్న అధిష్టానం విప్లవ్ ను మార్చకపోతే ఇబ్బందులు తప్పవని నిర్ధారణ చేసుకుంది. వెంటనే ముఖ్యమంత్రిని మార్చేయాలని డిసైడ్ చేసుకున్నది. అందుకనే విప్లవ్ ను ఢిల్లీకి పిలిపించుకున్న హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి దగ్గర రాజీనామా లేఖ తీసుకున్నట్లు తెలుస్తోంది. జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులను మార్చేయటం అన్నది ఒక విధానంగా బీజేపీ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఉత్తరాఖండ్ లో విజయవంతమైన ఫార్ములా మరి మిగిలన రాష్ట్రాల్లో వర్కవుటవుతుందో లేదో చూడాలి.