మును'గోడు': చేతులు కాలాక.. బీజేపీ ఆకులు పట్టుకుంటోందా?

Mon Sep 26 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

BJP In MunuGode

అంతన్నాడు.. ఇంతన్నాడు.. మన గంగరాజు (రాజగోపాల్ రెడ్డి) .. చివరకు ముంతమామిడి పుచ్చు తెచ్చాడే అని బీజేపీ శ్రేణులు మునుగోడులో గోడు వెల్లబోసుకుంటున్నాయట.. కోమటిరెడ్డి అంటే ఇన్నాళ్లు అదొక బ్రాండ్.. వారు నిలబడితే గెలవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాక అసలు విషయం అర్థమైందట.. అందుకే బీజేపీ అధిష్టానం.. మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టకుండా మొత్తం పరిస్థితులన్నీ చక్కదిద్దాకే ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అయ్యారట..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొడగొట్టి మరీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చేరేటప్పుడు తన పరపతిపై బోలెడన్నీ చెప్పారు. కానీ మునుగోడులో దిగాక కానీ ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందన్నది బీజేపీ పెద్దలకు తెలిసి రాలేదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది బీజేపీ పరిస్థితి.

రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో ప్రజలు నిలదీస్తుంటే బీజేపీ నేతలకు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే నష్టనివారణ చర్యలు చేపడుతోంది. అందుకే ఆగమేఘాలపై దేశంలోనే పాపులర్ వ్యూహకర్తలైన 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేసింది బీజేపీ. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి ప్రచార బాధ్యతను తప్పించి కేవలం క్యాండిడేట్ గా ప్రజల్లోకి వెళ్లాలని.. ప్రచారం చేరికలు ఎన్నికల వ్యూహాలు అన్నీ ఈ 16 మంది కమిటీ చూస్తుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసిందట..

బీజేపీలో చేరినప్పుడు ఈజీగా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి బీరాలకు పోయాడట.. కానీ బీజేపీ పెద్దలకు ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని అర్థం అవ్వడంతో 16మందితో కమిటీ వేసి ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడింది.

తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఆయన బీజేపీలో చేరినా.. ఆయన వెంట ఎవరూ వెళ్లడం లేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రమ్మన్నా రావడం లేదట... ఈ పరిణామంతో రాజగోపాల్ రెడ్డి షాక్ అయ్యారు.  పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఎందుకు మారావంటూ రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. పార్టీ మారిన వ్యక్తి గ్రామానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  

ఇక ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకున్నా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేసి డెవలప్ చేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గెలిచాక ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించిన పాపాన రాజగోపాల్ రెడ్డి పోలేదు. సో ఇప్పుడు పర్యటిస్తే ఆయనకు అడుగడుగునా నిలదీతలు కనిపిస్తున్నాయి. అందుకే 16 మందితో కమిటీ వేశారు. వాళ్లే ఇక మునుగోడు బాధ్యతలను తీసుకొని గెలుపు కోసం కష్టపడేందుకు రెడీ అయ్యారు.