బీజేపీ వ్యూహమా? మజాకానా? ఆ ప్రముఖ కుటుంబాలకి కీలక పదవులు!

Thu Jul 16 2020 20:00:01 GMT+0530 (IST)

BJP strategy? Key positions for those prominent families!

ఎత్తులకు పై ఎత్తులు వేయడం లో బీజేపీ నాయకుల తరువాతే ఎవరైనా. సందర్భానుసారం కొనసాగే తత్వం కొందరిది అయితే రాబోయే గండాన్ని ముందే ఉహించి దానికి తగ్గ ప్రణాళికలు రచించే తత్వం ఇంకొందరి. ఏదేమైనా కూడా ఇలాంటి ఎత్తులు వేశారు కాబట్టే కేంద్రం వరుసగా రెండు సార్లు భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే బీజేపీకి ఒక కోరిక అలాగే మిగిలిపోయింది. నార్త్ లో తీవ్రమైన ప్రభావం చూపుతున్న బీజేపీ సౌత్ విషయానికొచ్చే సరికి చతికిలపడిపోతుంది. కర్ణాటకలో కొంచెం అటు ఇటు అయ్యి అధికారాన్ని చేబట్టారు కానీ అక్కడా బీజేపీకి ఉండాల్సినంత ఆదరణ అయితే లేదు. ఎలాగోలా కర్ణాటక లో తన సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు మిగిలిన సౌత్ రాష్ట్రాలపై కన్నేసింది. ముఖ్యంగా 2021 లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ అధికారం చేజికించుకోవాలనే లక్ష్యం తో అడుగులు ముందుకు వేస్తుంది. అందుకు వ్యూహన్నీ కూడా ఇప్పటికే అమలులో పెట్టింది.ఆ వ్యూహంలో భాగంగానే తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ దత్తపుత్రికకి సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడికి నరహంతకుడు వీరప్పన్ కుమార్తె సంగీత మాంత్రికుడు ఇళయరాజా సోదరుడితో సహ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు కీలకపదవులు కట్టబెట్టింది.

ఎంజీ. రామచంద్రన్ ..ఈ పేరుకి తమిళ రాజకీయాల్లో తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత ఏడీఎంకే పార్టీని స్థాపించి తమిళనాడు సీఎం గా ఎన్నికైయ్యారు. ఎంజీఆర్ పేరు వింటే ఎప్పటికి తమిళ జనం జేజేలు కొడతారు. ఆ తరువాత అయన జయలలిత తమిళనాడుకు మూడు సార్లు సీఎంగా ఎన్నికై సంచలనం సృష్టించారు. కానీ ఆమె ఎంజీఆర్ కుటుంబ సబ్యులని మాత్రం పార్టీలోకి తీసుకోలేదు. అయితే ఎంజీఆర్ దత్తపుత్రిక గీతా బీజేపీలో చేరారు. దీనితో ఆమెకి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ కీలకపదవి కట్టబెట్టారు.

ఇక మరో కీలక వ్యక్తి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి కొద్దీ నెలల క్రితమే బీజేపీలో చేరారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాడు యువమోర్చ విభాగం ఉపాధ్యక్షురాలిగా విద్యారాణిని నియమించారు.

ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా బీజేపీలో ఉన్నారు. ఆయనకి కూడా పార్టీలో కీలకపదవి ఇచ్చారు. ఇకపోతే రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ..అయన రాజకీయ ప్రవేశం మాత్రం జరగడం లేదు. అసలు ఈ ఎన్నికల సమయానికైనా అయన రాజకీయ ప్రవేశానికి ముహూర్తం కుదురుతుందో లేదో.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు సంగీత దర్శకుడు దర్శక నిర్మాత గంగై అమరన్ కు బీజేపీలో కిలకపదవి దక్కింది. అలాగే వీరికే కాకుండా మరికొంతమంది ప్రముఖులకు కూడా బీజేపీలో సముచిత స్థానం కల్పించారు. మొత్తంగా 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ద్యేయంగా బీజేపీ వ్యూహం వేస్తుంది. చూడాలి మరి వారి వ్యూహం ఏమేర సఫలం అవుతుందో...