టీఆర్ ఎస్.. కాంగ్రెస్ లకు బీజేపీ డేంజర్ బెల్స్

Sat May 25 2019 20:00:01 GMT+0530 (IST)

BJP Danger Bells To Congress And TRS

తెలంగాణలో వెలువడిన ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు మాత్రమే కాదు.. కాంగ్రెస్ కు షాకింగ్ గా మారాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును విశ్లేషించే విషయంలో వారు బిజీబిజీగా ఉన్నారు. నిన్న మొన్నటివరకూ పెద్దగా లెక్కలో లేని బీజేపీ వారికిప్పుడు పెద్ద గండంగా మారింది. తామింతకాలం పెద్దగా పట్టించుకోని బీజేపీ.. తాజా ఎన్నికల్లో తన సత్తాను చాటిన నేపథ్యంలో అధికార.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.కేంద్రంలో తిరుగులేని అధికారం చేతిలోకి రావటం.. తాను టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో పాగా వేసే బీజేపీ దృష్టి ఈసారి తెలంగాణ మీద పడటం ఖాయమన్న అభిప్రాయం రెండుపార్టీల నేతల్లో వినిపిస్తోంది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే.. తమ ఉనికికే ప్రమాదం అన్న భావన రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకూ ఎవరో ఒకరి పొత్తుతో మాత్రమే సీట్లు సాధించే బీజేపీ.. ఈసారి అందుకు భిన్నంగా ఒంటరిగా బరిలోకి దిగి.. నాలుగు ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.  కీలక స్థానాల్లో బీజేపీ అధిక్యత ప్రదర్శించటం.. వచ్చిన ఓట్ల శాతం..సాధించిన మెజార్టీలు అన్ని టీఆర్ఎస్.. కాంగ్రెస్ లకు వార్నింగ్ బెల్స్ లాంటివన్న భావన వ్యక్తమవుతోంది.

తామెంత ప్రయత్నించినా దక్షిణాదిన కర్ణాటక మినహా మరెక్కడా పట్టు ప్రదర్శించలేదన్న బాధ బీజేపీలో ఉంది. దాన్ని తీరుస్తూ తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో తెలంగాణ మీద మోడీషాలు ఫోకస్ పెట్టటం ఖాయమంటున్నారు. దీనికి తోడు తమ పార్టీ వాదనకు స్పందించేందుకు తెలంగాణలోని పరిస్థితులు అనుకూలంగా ఉండట వారికి లాభించే అంశం. కరీంనగర్ సభలో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యతో పెల్లుబికిన సెంటిమెంట్ గులాబీ బాస్ కు షాకింగ్ ఫలితాన్ని ఇచ్చిందన్న అభిప్రాయం ఉంది.

బీజేపీ ఎజెండాకు సరిపోయే పరిస్థితులు తెలంగాణలో పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మోడీషాల కన్ను తెలంగాణ మీద పడుతుందని.. అదే జరిగితే తమ ఇద్దరికి ఇబ్బందేనన్న అభిప్రాయం టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఇద్దరికి ఉమ్మడి శత్రువుగా ఇప్పుడు బీజేపీ మారింది. మొన్నటివరకూ కమలనాథుల ఉనికిని లైట్ తీసుకున్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు వారి విషయంలో ఒక కన్నేసి ఉండాలన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.