బీజేపీకి మరో షాక్.. ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్?

Sun Sep 27 2020 21:31:56 GMT+0530 (IST)

BJP And NPP Alliance Hangs In The balance Manipur

బీజేపీకి మరో పార్టీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఏన్డీఏ నుంచి అకాలీదళ్ పార్టీ వైదొలిగి బీజేపీకి జలక్ ఇవ్వగా.. తాజాగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బీజేపీ సంకీర్ణ సర్కార్ కూలిపోయే దశలో ఉంది.బీజేపీ - ఎన్పీపీ కూటమి కలిసి మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎం బీరేన్ సింగ్ తాజాగా కేబినెట్ ప్రక్షాళన చేపట్టారు. ఎన్పీపీకి చెందిన ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగించడంతో ఇప్పుడా పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో మణిపూర్ లో సర్కార్ కూలడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తం 60మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 18మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్పీపీకి 4 - ఎన్.పీ.ఎఫ్ 4 - ఎల్జీపీ 1 - ఇండిపెండెంట్లు 2 మద్దతుతో ఎన్డీఏ సర్కార్ ను ఏర్పాటు చేసింది.

అయితే సీఎం బీరేన్ సింగ్ ఏకపక్ష పోకడలను నిరసిస్తూ ఎన్పీపీ తన మద్దతును వెనక్కి తీసుకుంది. అమిత్ షా జేపీ నడ్డాలు రంగంలోకి దిగి ఎన్పీపీ నేతలను బుజ్జగించి తిరిగి సీఎం బీరేన్ కు మద్దతు పలికేలా చేశారు.

కానీ తాజాగా కేబినెట్ ప్రక్షాళనలో ఫిరాయింపుదారులకు చోటు కల్పించి ఎన్పీపీ ఇద్దరు మంత్రులను సీఎం తొలగించడంతో మళ్లీ ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ప్రభుత్వం నుంచి వైదొలగడానికి ఎన్పీపీ రెడీ అయ్యింది.