చైనా కంపెనీకి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ ...ఓమర్ అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు !

Mon Aug 03 2020 16:20:23 GMT+0530 (IST)

BCCI Gets Green Signal From The Centre For IPL

కేంద్రం తాజాగా ఐపీఎల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఐపీఎల్ నిర్వాహకులు మిగిలిన పనులని పూర్తి చేయడంలో బిజీ అయ్యారు. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ ఐపీఎల్ సీజన్ 13 జరగబోతుంది. దీనిపై జమ్మూకశ్మీర్ మాజీసీఎం నేషనల్ కాన్ఫరెన్స్  నేత ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పై స్పందించారు. చైనా కంపెనీలు  ఐపీఎల్ క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్ లుగా ఉండటంపై అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఓ వైపు చైనా యాప్స్ బ్యాన్ చేసి  చైనా వస్తువులపై బైకాట్ చేయమని ప్రజలకి చెప్పి మరోవైపు చైనీస్ మొబైల్ కంపెనీ..’వీవో’ సహా ఇతర స్పాన్సర్స్ అందరినీ కొనసాగించాలని ఐపీఎల్ గవర్ణింగ్ కౌన్సిల్ నిర్ణయించడం ఏమిటని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా ఇంకా వీవోను కొనసాగించడంలో అసలు అర్థం లేదని అన్నారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే  ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. చైనీస్ మనీ ఇన్వెస్ట్ మెంట్ స్పాన్సర్ షిప్ అడ్వర్టైజింగ్ విషయాల నిర్వహణలో ఈ గందరగోళ వైఖరిపై చైనా ముక్కున వేలేసుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు.

 ఈ ఘటన తర్వాత  చైనా టీవీలను  బాల్కనీల నుంచి విసిరి పారేసిన వారి మానసిక పరిస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  పాపం ఇడియట్స్ అంటూ అబ్దుల్లా  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే  చైనా కంపెనీల స్పాన్సర్  షిప్ యాడ్స్ లేకుండా మనం ఈ విధమైన ఈవెంట్స్ ని నిర్వహించలేమా అంటూ ప్రశ్నించారు.