Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్ .. 13 ఏళ్ల చరిత్రలో తొలిసారి అలా !

By:  Tupaki Desk   |   3 Aug 2020 7:50 AM GMT
ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్ .. 13 ఏళ్ల చరిత్రలో తొలిసారి అలా !
X
క్రికెట్ ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020కి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో తాజా సీజన్‌ కు సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో టోర్నీ సమయం 51 రోజుల నుంచి 53 రోజులకి పెరగగా.. మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఏకంగా 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండటం గమనార్హం. అలాగే, రాత్రి మ్యాచ్‌లు 8 గంటలకి బదులు అరగంట ముందే అంటే.. రాత్రి 7.30కి ప్రారంభంకానున్నాయి. ఇక మధ్యాహ్నం మ్యాచ్‌లు సాయంత్రం 3.30 గంటలకే ఆరంభమవుతాయి.

కరోనా దృష్ట్యా లీగ్ ప్రారంభ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగబోతున్నాయి. కొన్ని మ్యాచ్‌ల తర్వాత, స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి ప్రేక్షకులను అనుమతించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం 13ఏళ్ల ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌ వీకెండ్‌ లో కాకుండా వారం మధ్యలో(నవంబర్ 10 న) జరగబోతుండటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ దుబాయ్, షార్జా, అబుదాబిలలో జరుగుతాయి.

అలాగే ఈ సమావేశంలో, చైనా కంపెనీలతో సహా అన్ని స్పాన్సర్‌లను నిలుపుకోవాలని నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ పాలక మండలి.వివోతో పాటు మిగిలిన చైనా కంపెనీ స్ఫాన్సర్లు కూడా అలానే కొనసాగనున్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ గా వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఆ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం 2022తో ముగుస్తుంది. వివోను వద్దనుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్ ‌ను పట్టడం చాలా కష్టం. దీనితో వివో కే మొగ్గుచూపారు. దేశంలో సాధారణ ఎన్నికల సందర్భంలో ఐపీఎల్‌ రెండుసార్లు (2009, 2014) విదేశాల్లో జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దేశం బయట జరుగనుంది