Begin typing your search above and press return to search.

రారా క్రిష్ణయ్య... : తెలంగాణా బీసీకి పెద్దరికం!

By:  Tupaki Desk   |   17 May 2022 9:39 AM GMT
రారా క్రిష్ణయ్య... : తెలంగాణా బీసీకి  పెద్దరికం!
X
ఆయన జగమెరిగిన బీసీ నేత. జాతీయ స్థాయిలో కూడా అనేక ఉద్యమాలు చేసిన మేటి, ఘనాపాటి. అటువంటి బీసీ పెద్దను వైసీపీ అధినాయకత్వం నేరుగా రాజ్యసభకు పంపబోతోంది. ఆయనను ముందు పెట్టి బీసీ ట్రంప్ కార్డుకు ఏపీ రాజకీయాల్లో తెర తీయనుంది. ఒక విధంగా ఆర్ క్రిష్ణయ్య ఎంపిక వైసీపీ తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం అని భావించాలి.

ఏపీలో బీసీలను నమ్ముకోవడం వినా వేరే దారి లేని వైసీపీ వచ్చే ఎన్నికలను వారి మద్దతుతో గెలుచుకోవాలనుకుంటోంది. గతసారి కూడా రెండు బీసీ సీట్లు రాజ్యసభకు పంపించిన వైసీపీ ఈసారి కూడా బీసీలకు సగభాగం ఇస్తోంది. అందులో చెప్పుకోవాల్సింది ఆర్ క్రిష్ణయ్య విషయం.

ఆయన 2019 ఎన్నికల ముందు కూడా వైసీపీకి ఆర్ క్రిష్ణయ్య బీసీ ప్రచారం బాగా ఉపయోగపడింది. బీసీ డిక్లరేషన్ సభలో కూడా క్రిష్ణయ్య మాట్లాడుతూ వైసీపీనే బీసీలు నమ్మాలని కోరడం నాడు సంచలనం అయింది. ఇక అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలో కూడా వైసీపీ బీసీలకు పదవులు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది.

ఈ నేపధ్యంలో బీసీలకు అతి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్ క్రిష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా మరోమారు బీసీల మనసు చూరగొనాలని చేస్తున్న ప్రయత్నం ఇది. ఒక విధంగా రాజకీయంగా ఇది మంచి ఎత్తుగడగానే చెప్పాలి. అయితే ఆర్ క్రిష్ణయ్య గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా తెలంగాణాలో టీడీపీ ప్రొజెక్ట్ చేసింది.

కానీ పెద్దగా ఉపయోగం జరగలేదు. ఇక్కడ క్రిష్ణయ్య మీద బీసీలకు గురి ఉన్నా రాజకీయ పార్టీల మీద ప్రేమాభిమానాలు ఉంటేనే ఈ ఎత్తుగడ వర్కౌట్ అవుతుంది. మరో వైపు ఏపీలో బీసీ నేతలు చాలా మంది ఉన్నారు. వారు తమకు తాముగా అనేక కార్యక్రమాలను చేసుకుంటున్నారు.

మరి వారిని ఆదరించకుండా తెలంగాణా బీసీకు పెద్ద పదవి ఇవ్వడం ద్వారా వైసీపీ ఏపీ రాజకీయాల్లో బీసీ కార్డు ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ తన రాజకీయ వ్యూహాలను కొనసాగిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయంగానే దీన్ని చూడాలి.