Begin typing your search above and press return to search.

ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   30 Jan 2023 7:00 PM GMT
ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
X
2002 నాటికి గుజరాత్‌ అల్లర్లలో అప్పటి ఆ రాష్ట్ర సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పాత్రపై ప్రముఖ వార్త సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, వివిధ సంస్థలు పలు యూనివర్శిటీల్లో ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించిన సంగతి విదితమే. మరోవైపు ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా పట్టించుకోకుండా దీని ప్రదర్శనను బీజేపీ వ్యతిరేక పార్టీలు, సంస్థలు కొనసాగిస్తున్నాయి.

మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మన దేశంలో దీనిని ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని.. ఈ క్రమంలో దీనిపై దాఖలైన పిల్‌ లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు.

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్లను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 6న వీటిని విచారిస్తామని వెల్లడించింది.

దీంతో వచ్చేవారం బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం వివాదంలో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. ఇప్పటికే గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం తమ అత్యవసర అధికారాలు ఉపయోగించి నిషేధించడాన్ని పలువురు ఇప్పటికే తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పిల్‌ లను పరిగణనలోకి తీసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్, సామాజిక కార్యకర్త, లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా, సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌ తదితరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

పౌరులు, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని.. అందుకే దయచేసి ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లపై వచ్చే నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు ప్రజలకు ఉందో, లేదో కూడా కోర్టు తేల్చాలని విన్నవించారు. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.