2 నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ ఎలానో చెప్పిన పెద్ద మనిషి

Tue Feb 23 2021 15:00:01 GMT+0530 (IST)

Azeem Prem Ji Sensational Comments On Corona Vaccine

కరోనా పీడ వీడిపోయిందన్న భావనలో ఉన్న వారికి షాకిస్తూ.. గడిచిన వారంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ కొత్త ఆందోళనను కలిగిస్తోంది. ఇలాంటివేళ.. ఉన్న ఒకే ఒక్క అవకాశం.. వ్యాక్సినేషన్ ను మరింత వేగంగా పూర్తి చేయటం. ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. వ్యాక్సినేషన్ కార్యక్రమం అనుకున్నంత బాగా జరుగుతున్నది లేదు. ఇలాంటివేళ.. వ్యాక్సిన్ ను వేగంగా నిర్వహించాలంటే.. తక్కువ వ్యవధిలో ఎక్కువమందికి ఇప్పించాలంటే ఏం చేయాలన్న అంశంపై విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ కీలక వ్యాఖ్యలు చేశారు.కరోనాపై పోరాడేందుకు గత ఏడాదిలో విప్రో సంస్థ రూ.1125 కోట్లను అందించనున్నట్లుగా వెల్లడించటం తెలిసిందే. తాజాగా ఒక సమావేశానికి హాజరైన ప్రేమ్ జీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్యానించారు. ప్రైవేటు సంస్థల్ని భాగస్వామ్యం చేయటం ద్వారా కేవలం 2 నెలల వ్యవధిలో యాభై కోట్ల మందికి వ్యాక్సిన్ ఇప్పించే వీలుందన్నారు.

తక్కువ సమయంలో వ్యాక్సిన్ తయారు చేసిన భారత్.. వాటిని పెద్ద మొత్తంలో తయారు చేసే విషయంలో ఇబ్బంది పడుతోందన్నారు. ఈ ఇబ్బందిని అధిగమించటానికి ప్రైవేటు భాగస్వామ్యంతో అధిగమించొచ్చన్నారు. ఈ క్రమంలో కాస్త ధర పెరగొచ్చని.. కానీ ఆ మొత్తం ఆమోదయోగ్యంగానే ఉంటుందన్నారు.

సీరం సంస్థ రూ.300లకు ఇస్తున్న వ్యాక్సిన్.. ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.400 అవుతుందని.. అదేమీ పెద్ద మొత్తం కాదన్నారు. అజీమ్ చెప్పిన ఐడియాను విన్నారా మోడీ? ఓవైపు కరోనా మళ్లీ విరుచుకుపడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. వ్యాక్సిన్ ను వీలైనంత వేగంగా ఎక్కువమంది ప్రజలకు అందించటం ద్వారా.. మహమ్మారికి చెక్ పెట్టే వీలుందన్నది మర్చిపోకూడదు.