Begin typing your search above and press return to search.

పుట్టిన గడ్డ మీద.. పుట్టిన దేశం మీదనే అరుదైన రికార్డు.. అజాజ్ సొంతం

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:28 AM GMT
పుట్టిన గడ్డ మీద.. పుట్టిన దేశం మీదనే అరుదైన రికార్డు.. అజాజ్ సొంతం
X
అప్పుడెప్పుడో 1956లో క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక బౌలర్.. మొత్తంగా పదికి పది వికెట్లు తీసేసి రికార్డును క్రియేట్ చేశాడు. కట్ చేస్తే.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అనిల్ కుంబ్లే పుణ్యమా అని అలాంటి రికార్డు మరోసారి క్రియేట్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మరో బౌలర్ ఒకే ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే.. మొదటి రెండు రికార్డులకు భిన్నమైనది తాజా రికార్డు. ఎందుకంటే.. పదికి పది మాత్రమే కాదు.. మరిన్ని విశేషాలు ఈ రికార్డును సొంతం చేసుకున్న ఇజాజ్ పటేల్ తో ఉన్నాయి.

ఎందుకంటే.. తాను పుట్టిన గడ్డ మీద జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును సొంతం చేసుకుంటే.. తనకు జన్మనిచ్చిన దేశం మీదన ఇలాంటి రికార్డును క్రియేట్ చేయటం మరో విశేషం. అది కూడా లేటు వయసులో ఇలాంటి రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే.. ఇంతకు మించిన మరో చిత్రం ఏమంటే.. ఇంత అరుదైన రికార్డును సాధించిన మ్యాచ్ లో.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఓటమి కోరల్లోకి చిక్కుకుపోవటం. ఇలా విచిత్రాలకు విచిత్రంగా మారారు ఇజాజ్ పటేల్.

తాజాగా జరుగుతున్న కివీస్ టెస్టులో టీమిండియా జట్టు నడ్డి విరిచి.. పదికి పది వికెట్లను సొంతం చేసుకున్నాడు ఇజాజ్ పటేల్. అతడు పుట్టింది ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో ఇజాజ్ పుట్టాడు. తల్లి టీచర్ అయితే.. తండ్రి వ్యాపారి. ఐదు అడుగుల ఆరు అంగుళాలు ఉండే ఇజాజ్ పటేల్ కు ఎనిమిదేళ్ల వయసులో అతడి కుటుంబం న్యూజిలాండ్ కు వెళ్లిపోయి.. అక్కడే స్థిరపడింది. న్యూజిలాండ్ జాతీయుడిగా మారాడు. భారత మూలాలు ఉన్నప్పటికీ.. అతని కెరీర్ మొత్తం న్యూజిలాండ్ లోనే చోటు చేసుకుంది.

ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. క్రికెట్ లో 30 ఏళ్ల వయసు అంటే.. అప్పటికే కెరీర్ లో రాణించి.. ఇక రిటైర్మెంట్ దిశగా అడుగులు వేసే వేళలో.. కివీస్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పటివరకు11 టెస్టులు మాత్రమే ఆడాడు. 39 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు తాజాగా నెలకొల్పిన 10/119. ఇప్పటివరకు ఏడు టీ 20 మ్యాచ్ లు ఆడిన అతను.. లేటు వయసులో జట్టులోకి వచ్చినప్పటికీ.. తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు.

ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన ఘనత ఇప్పటివరకు ముగ్గురు కాగా.. వీరు ముగ్గురు స్పిన్నర్లు కావటం ఒక విశేషంగా చెప్పాలి. తొలిసారి 1956లో ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆసీస్ జట్టు మీద 53 పరుగులకే 10 వికెట్లు పడగొట్టి తొలిసారి ఈ రికార్డును సాధించిన ఆటగాడిగా చరిత్రలోకి ఎక్కారు. అనంతరం 1999లో అనిల్ కుంబ్లే పాకిస్థాన్ జట్టు మీద 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లను సొంతం చేసుకొని.. ఈ అరుదైన రికార్డును సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఇది జరిగిన 22 ఏళ్లకు భారత మూలాలు ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు ఇజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లను.. అది కూడా తాను పుట్టిన భారత దేశ జట్టు మీద.. అది కూడా తాను పుట్టిన ముంబయి గడ్డ మీద ఈ అరుదైన రికార్డును సాధించాడు.

ఇంతటి రికార్డును సాధించిన తర్వాత గాల్లో తేలిపోయినట్లుందే అన్నట్లు ఉండాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇజాజ్ వరకు అద్భుతమైన ఆటను ప్రదర్శించినప్పటికీ.. జట్టుగా మాత్రం కివీస్ అలాంటి ప్రదర్శన చేయకపోవటంతో తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్ అధిక్యతతో పాటు.. రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు సాధించిన 69పరుగులు కలిపితే 332 పరుగులతో.. పటిష్టమైన స్థితిలో భారత జట్టు ఉంది. ఈ టెస్టులో ఓటమి నుంచి తప్పించుకోవటం కివీస్ కు చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.