Begin typing your search above and press return to search.

అయోధ్య కేసులో చక్రంతిప్పిన కేంద్రం.?

By:  Tupaki Desk   |   16 Oct 2019 8:24 AM GMT
అయోధ్య కేసులో చక్రంతిప్పిన కేంద్రం.?
X
అయోధ్య కేసు.. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఇప్పుడు దేశంలోనే కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమైంది. బుధవారం సాయంత్రంతో విచారణ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏ తీర్పు ఇస్తే ఎవరు ఆగ్రహిస్తారో.? దేశంలో మళ్లీ మతకలహాలు చోటుచేసుకుంటాయోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.

అయితే తాజాగా ఈ అయోధ్య కేసులో భారీ ట్విస్ట్ వచ్చేసింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో బాబ్రీ మసీదు తరుఫున ప్రధాన కక్షిదారుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనివెనుక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీబీఐని ప్రయోగించడమే కారణమని ప్రచారం జరుగుతోంది.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఈ స్థలం రామజన్మభూమి అని హిందువులు.. కాదు బాబ్రీ మసీదునని ముస్లింలు వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు ఇదివరకే ఈ భూ వివాదంపై ఒక ప్యానెల్ కమిటీ వేసి విచారిస్తోంది.

రామజన్మభూమి కాదు.. ఇది బాబ్రీ మసీదు స్థలమేనని ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టులో కేసు వేసింది. ప్రతిగా హిందూ ధార్మిక సంఘాలైన నిర్మోహి అఖాడా, రామ్ లల్లా విరాజ్ మాన్ లు ఇది రామజన్మభూమి స్థలమేనని సుప్రీం కోర్టులో పిటీషన్లు వేశారు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న కేసు విచారణ బుధవారం నాటితో ముగియబోతోంది. సుప్రీం ఏం తీర్పునిస్తుందాననే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ఈ స్థలంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన ప్రధాన కక్షిదారు సున్నీ వక్ఫ్ బోర్డు కేసును వెనక్కి తీసుకోవడానికి రెడీ కావడం.. సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలుపడం సంచలనంగా మారింది. దీనివెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్లాన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జెడ్ ఏ ఫారూఖీ అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారణ అయ్యింది. ఫారూఖీ బాబ్రీ మసీదు భూములను చైర్మన్ హోదాలో అక్రమంగా విక్రయించినట్టు ఉత్తరప్రదేశ్ సర్కారు గుర్తించి ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఫారుఖీపై కేసు నమోదు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఇక ఫారూఖీ బాబ్రీ మసీదు భూములను అక్రమంగా అమ్మేయడం.. సున్నీ వక్ఫ్ బోర్డులో కూడా వివాదాలకు కారణమై విడిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తెరవెనుక మంత్రాంగం నడిచింది. బీజేపీ కేసులతో ఉక్కిరి బిక్కిరిచేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో సుప్రీం కోర్టులో సున్నీవక్ఫ్ బోర్డు వేసిన బాబ్రీ మసీదు కేసును ముస్లిం సంఘాలు వెనక్కి తీసుకోవడానికి కారణమైందన్న చర్చ జరుగుతోంది.

ఇదే జరిగితే అయోధ్య భూవివాదం కేసు నీరుగారి ఇది రామజన్మభూమి అని నిర్ణారణ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే జరిగితే మోడీ మంత్రాంగం ఫలించి హిందువుల దశాబ్ధాల అభిలాష నెరవేరే అవకాశం ఉంటుంది.

*అసలు ఏంటీ అయోధ్య కేసు..

1992 డిసెంబర్ 6న హిందువుల గుంపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టింది. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు. ఇక్కడ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారని ఈ చర్యకు పాల్పడ్డారు. బాబ్రీ మసీదు కూలగొట్టడంతో దేశంలో మత కల్లోలాలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా అల్లర్లలో 2000 మంది చనిపోయారు.

ఈ భూమి మీద హిందువులు - ముస్లింలు పంతం పట్టారు. సుప్రీం కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులో ఎలాంటి తీర్పును ఇవ్వాలో తెలియక సుప్రీం కోర్టు విచారణ కొనసాగిస్తూనే ఉంది. బుధవారంతో విచారణ ముగిసి తీర్పు వెలువరించనుంది.