Begin typing your search above and press return to search.

ఇది నయా భారతం.. ఎట్టకేలకు రాముడ్ని నమ్మేవారి స్వప్న సాకారం

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:45 AM GMT
ఇది నయా భారతం.. ఎట్టకేలకు రాముడ్ని నమ్మేవారి స్వప్న సాకారం
X
ఒక సాధారణ అంశాన్ని అసాధారణ అంశంగా మార్చేసి.. దాన్నోరాజకీయ ఎజెండాగా.. దేశ ప్రజల మధ్య భిన్నవాదనలకు తెర తీసేలా చేయటంలో రాజకీయానికి మించింది మరొకటి లేదనే చెప్పాలి. అయోధ్యలోని కట్టడం ఏమిటన్న విషయంపై అందరికి క్లారిటీ ఉంది. కానీ.. అదేమీ లేనట్లుగా.. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా.. దాని మురగబెట్టటం ద్వారా రాజకీయ ప్రయోజనాల్ని పొందాలనుకోవటం ద్వారా దేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

ఒకట్రెండు తరాల వారు జై శ్రీరాం అంటూ ఊగిపోవటం.. ఇది నచ్చినోళ్లు కేరింతలు కొడితే.. నచ్చనోళ్లు దాన్నో దారుణమైన అంశంగా చూసిన వైనాల్ని మర్చిపోలేం. జైశ్రీరాం అన్న నినాదం భారతజీవనంలో ఒక భాగమన్నది మర్చిపోకూడదు. దానికి రంగులు అద్దిన రాజకీయ మకిలి ఎట్టకేలకు వీడిపోయిందని చెప్పాలి. రామాలయం విషయంలో అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవటం.. దానికి అనుగుణంగా చోటు చేసుకున్న పరిణామాలతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు ఈ రోజు పడనుంది.

రాముడు పుట్టింది ఎక్కడన్న ప్రశ్నను చిన్న పిల్లాడ్ని అడిగినా అయోధ్య అని చెబుతారు. అంత చిన్న విషయం మీద లెక్క తేలటానికి ఎన్ని వందల ఏళ్లు పట్టిందన్నది తెలిసిందే. విషయం ఏదైనా దాని చుట్టు రాజకీయం వచ్చి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనటానికి నిదర్శనంగా అయోధ్య ఎపిసోడ్ ను చెప్పొచ్చు. దేశంలోని చిన్న ఊరులోనూ రామాలయం ఉంటుంది. కానీ.. అయోధ్యలోని రామాలయానికి వచ్చేసరికి ఎంత పెద్ద సమస్యగా మార్చారో చూస్తే.. దేశంలోని కుహనా లౌకికవాదుల మీద ఆగ్రహం కలుగక మానదు.

వందల ఏళ్ల తర్వాత ఎట్టకేలకు దేశంలోని రాముడ్ని నమ్మే వారందరి కల నెరవేరుతుంది. ఇక్కడ మేం హిందువులని ప్రస్తావించటం లేదు. ఎందుకంటే.. రాముడ్ని హిందువులు మాత్రమే నమ్మాలా? ముస్లింలు.. క్రిస్టియన్లు.. బౌద్దులు.. జైనులు.. ఏ మతానికి చెందిన వారైనా రాముడ్ని అభిమానించకూడదన్న రూల్ లేదుగా? అదే సమయంలో హిందువులంతా రాముడ్ని నమ్మేవారే అయితే.. అయోధ్య ఎపిసోడ్ అంతకాలం ఉండేది కాదు. అందుకే రాముడ్ని.. రాముడి మీద నమ్మకాన్ని ఒక మతానికి పరిమితం చేయకుండా.. శ్రీరాముడ్ని.. ఆయన తత్త్వాన్ని నమ్మేవారు మాత్రమే కాదు.. అభిమానించేవారు.. ఆరాధించేవారు.. సానుభూతి ఉన్న వారు.. వేరే మతాల్లో ఉన్నా.. శ్రీరామ తత్త్వాన్ని గౌరవించేవారందరి కల ఈ రోజు సాకారం అవుతుందని చెప్పాలి. ఈ రోజు భూమిపూజతో మొదలయ్యే అయోధ్య రామాలయం మరో మూడేళ్లలో పూర్తి కానుంది.

ఒకప్పుడు అయోధ్యలో రామాలయం అన్నంతనే కొద్ది మంది ఉప్పొంగిపోతే.. మరికొందరు భిన్నమైన వాదనల్ని వినిపించేవారు. ఇప్పుడు అందుకుభిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నది మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఇది నయా భారతం. ఈ తరం వారు.. ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకుంటారు. న్యాయాన్ని ఒప్పుకుంటారు. పాత వివాదాల్ని పరిష్కరించుకొని కొత్తగా జీవించాలనుకుంటారు. ఇదే స్ఫూర్తి మిగిలిన అంశాల్లోకి సాగటం ద్వారా.. భారతావని విలక్షణ తత్త్వాన్ని ప్రపంచ పటంలో నిలపాల్సిన అవసరం ఉంది. జైశ్రీరాం.