ఆ సొమ్ము రికవరీకి.. నవరత్నాల నిలిపివేత..ఎక్కడంటే..!

Wed Dec 08 2021 16:04:41 GMT+0530 (IST)

Authorities took this tough decision to Money Recover

అధికారులు చేసిన తప్పిదం.. పేదల మెడకు చుట్టుకుంది. అయితే.. పేదల్లో ఉన్న కొంత ఉదాసీనత కూడా ప్రభుత్వ ఆగ్రహానికి కారణంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఏటా రెండు విడతలుగా ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రైతు కుటుంబానికి రూ.13500 చొప్పున సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి.. నిధులు విడుదల చేస్తున్నారు.అయితే.. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. రైతులు కాని వారి బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు వెళ్లాయి. దీనికి పూర్తి బాధ్యత అధికారులదే.

అయితే.. అధికారులపై చర్యలు తీసుకున్నారో లేదో తెలియదుకానీ.. పేదలపై మాత్రం అధికారులు అధికారం ఝుళిపించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని కొంతమందికి రేషన్ పింఛన్ నిలిపివేయాలని సంబంధించి అధికారులను స్థానిక తహసీల్దార్ ఆదేశించారు. గత ఏడాది చివరిలో అధికారుల తప్పిదంతో గ్రామంలోని 247 మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి.

అవి తిరిగి వసూలు చేసేందుకు అధికారులు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.2020 డిసెంబర్‌లో మండలంలోని కొదమ పంచాయతీలో లబ్ధిదారులకు పడాల్సిన రైతు భరోసా సొమ్ము రూ.13500 చొప్పున శివరాంపురం గ్రామంలోని కొంత మంది రైతుల ఖాతాల్లో జమ అయింది.

దీన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు అప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లి పొరపాటున ఖాతాల్లో సొమ్ము జమ అయిందని.. వెనక్కి తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు.

అయితే ఈ 11 నెలల్లో మొత్తం 247 మందికి గాను 59 మంది మాత్రమే సొమ్ము వెనక్కి తిరిగిచ్చారు. ఇంకా 188 మంది చెల్లించాల్సి ఉంది. వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు నిలిపివేయాలంటూ తహసీల్దార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఇప్పుడు పేదలు.. భయం గుప్పిట్లో పెట్టుకుని.. కార్యాలయాలకు వెళ్లి మరీ.. సంబంధిత నిధులను తిరిగి ఇస్తుండడం గమనార్హం. దీనిలో అధికారుల తప్పిదం ఉన్న నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని.. పేదలు ప్రశ్నిస్తున్నారు.