అఫ్గాన్ లో ఆస్ట్రేలియా సైనికుల నరమేధం..39 మందిని కిరాతకంగా..!

Fri Nov 20 2020 19:19:33 GMT+0530 (IST)

Australian Special Forces Accused of Afghan War Crimes

అఫ్గాన్ లో ఆస్ట్రేలియా సైనికులు కొన్ని దారుణ ఘటనలకు  పాల్పడ్డారు. ఉగ్రవాద చర్యలతో ఏ మాత్రం సంబంధం లేని సామాన్య ప్రజలను అతి దారుణంగా చంపేశారు. శాంతి పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆఫ్ఘన్ కు వెళ్లిన ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు 39 మంది సాధారణ పౌరులను దారుణంగా చంపేశారు. వారిలో కొందరు ఖైదీలను కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ జనరల్ అంగుస్ క్యాంప్ బెల్ వెల్లడించారు. 2005 నుంచి 2016 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో తమ దేశ సైనికులు వార్ క్రైమ్ కు పాల్పడినట్లు నిర్దారణ చేశారు.11 సంవత్సరాల పాటు సైనిక బలగాలు తమ తప్పును కప్పిపుచ్చుకోవడంలో భాగంగా సామాన్య ప్రజలను చంపివేశారని దర్యాప్తులో తేలినట్లు ఆయన తెలిపారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన సైనికుల తరఫున తాను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఆస్ట్రేలియా సైనికుల యుద్ధ నేరాలపై నిర్వహించిన విచారణ సందర్భంగా క్యాంప్ బెల్.. 465 పేజీల నివేదికను అందజేశారు. 39 మందిని చట్టవిరుద్ధంగా హత్య చేయడంతో రెజిమెంట్ - సాయుధ దళాలకు భాగస్వామ్యం ఉందని - నిబంధనలకు విరుద్ధంగా సామాన్య పౌరులను హతమార్చిన ఘటనతో ప్రమేయం ఉన్న సాయుధ బలగాలకు ఇదివరకు ప్రకటించిన సేవా పతకాలను వెనక్కి తీసుకుంటామని క్యాంప్ బెల్ తెలిపారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడులను నిర్వహించిన తరువాత.. ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఏరివేతకు దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా సైన్యానికి మద్దతుగా ఆస్ట్రేలియా సైనిక బలగాలు ఆఫ్ఘన్ కు వెళ్లాయి. శాంతి పరిరక్షణ బలగాలుగా 2016 వరకూ విడతల వారీగా అక్కడే మకాం వేశాయి. 26 వేల మంది ఆస్ట్రేలియా సైనికులు ఆఫ్ఘన్ కు వెళ్లారు. ఆ సమయంలో వారు నరమేథానికి పాల్పడినట్లు తెలిసింది.