Begin typing your search above and press return to search.

కోర్టులోనే ఆ సంచ‌ల‌న‌ హ‌త్య కేసు నిందితుల‌పై దాడి!

By:  Tupaki Desk   |   3 July 2022 2:26 AM GMT
కోర్టులోనే ఆ సంచ‌ల‌న‌ హ‌త్య కేసు నిందితుల‌పై దాడి!
X
బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ ఒక టీవీ డిబేట్ లో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడ‌ని రాజ‌స్థాన్ లోని ఉద‌యపూర్ లో కొద్ది రోజుల క్రితం ఒక టైల‌ర్ క‌న్హ‌య్య‌లాల్ ను ప‌ట్ట‌ప‌గ‌లే అత‌డి షాపులోనే ఇద్దరు కిరాత‌కంగా హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సైతం చంపుతామ‌ని బెదిరించారు.

దీంతో ఉద‌యపూర్ లో హింస చెల‌రేగింది. పోలీసులు క‌ర్ఫ్యూ విధించడంతోపాటు 144 సెక్ష‌న్ విధించారు. అలాగే ఇంట‌ర్నెట్ రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ ఎత్తున పోలీసుల‌ను రంగంలోకి దించారు. ఈ హ‌త్య‌ను ప‌లు ముస్లిం సంస్థ‌ల‌తో స‌హా హిందూ సంస్థ‌లు ఖండించాయి.

మ‌రోవైపు నిందితులు రియాజ్ అక్త‌ర్, గౌస్ మహ్మ‌ద్ ల‌ను హ‌త్య జ‌రిగిన రోజే పారిపోతుండ‌గా పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును జాతీయ నేర ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. ఎన్ఐఏ విచార‌ణ‌లో నిందితులిద్ద‌రికీ పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలున్నాయ‌ని వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో ఈ కేసును ఎన్ఐఏ లోతుగా విచారిస్తోంది.

కాగా ఇద్దరు హంతకులను రాజ‌స్థాన్ లోని జైపూర్ కోర్టుకు తరలించారు. అక్క‌డ న్యాయ‌మూర్తి ముందు హాజ‌రుప‌రిచారు. అయితే అక్క‌డ ఉన్న ఒక పెద్ద గుంపు నిందితులిద్ద‌రిని చితక‌బాదింది. అంతేకాకుండా వారిద్ద‌రి బ‌ట్ట‌లు సైతం చింపేసింది. దీంతో అప్ర‌మత్త‌మైన పోలీసులు జ‌నాన్ని చెద‌రగొట్టారు. అప్ప‌టికే జనం చేతిలో గాయాల‌పాలైన‌ నిందితులిద్ద‌రిని పోలీసు వ్యాన్ లో ఎక్కించి ర‌క్షించారు.

కాగా టైల‌ర్ హ‌త్య జ‌రిగిన‌ప్పుడు నిందితులు.. రియాజ్ అక్త‌ర్, మ‌హ్మ‌ద్ గౌస్ ల‌తోపాటు మ‌రో ఇద్ద‌రు కూడా పాలుపంచుకున్నార‌ని చెబుతున్నారు. దీంతో వారిద్ద‌రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని కూడా హంత‌కుల‌తోపాటు జైపూర్ లో ఎన్ఐఏ కోర్టుకు తీసుకువ‌చ్చారు. దీంతో అక్క‌డికి పెద్ద ఎత్తున చేరుకున్న ప్ర‌జ‌లు, న్యాయ‌వాదులు పాకిస్తాన్ న‌శించాల‌ని, క‌న్హ‌య్య హ‌త్య కేసు నిందితుల‌ను ఉరితీయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.