క్యాబ్ డ్రైవర్ పై దాడిః హోరెత్తిన సోషల్ మీడియా.. యువతిపై ఎట్టకేలకు కేసు

Tue Aug 03 2021 21:00:01 GMT+0530 (IST)

The case is finally over against the young woman

మనిషిలో ఉన్న దరిద్రపు లక్షణాల్లో ఒకటి చేసిన తప్పును కవర్ చేసుకోవడం. దాన్ని కప్పి పుచ్చుకునే క్రమంలో ఇతరులపై నెట్టేయడం. వాళ్లపై నెట్టేయడమే కాకుండా.. వారిపై దాడి చేయడం. ఇందులో ఆడ మగ అనే తేడాలేవీ లేవు. అన్నీ.. ఆ తానులో ముక్కలే. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సంఘటన. జూలై 30వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తప్పు తాను చేయడమే కాకుండా.. పక్కవ్యక్తిపై దాడిచేసిన మహిళను అరెస్టు చేయాలని సోషల్ మీడియా హోరెత్తింది. దీంతో.. ఎట్టకేలకు పోలీసులు ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఇంతకీ.. ఆ రోజు ఏం జరిగిందన్నది చూస్తే..ఉత్తర ప్రదేశ్ లోని లక్నో అవుథ్ సిగ్నల్ ఏరియా. సమయం రాత్రి 9.30 అవుతోంది. ఈ క్రమంలో చివరి క్షణాల్లో సిగ్నల్ దాటేందుకు వేగంగా వచ్చేస్తున్నాయి కొన్ని వాహనాలు. అయితే.. ఓ మహిళ కాలినడకన సిగ్నల్ క్రాస్ చేయాల్సి ఉంది. రెడ్ సిగ్నల్ పడకుండానే వాహనాలు ప్రయాణిస్తుండగానే.. మధ్యలోంచి నడుస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ క్యాబ్ సిగ్నల్ క్రాస్ చేసేందుకు వేగంగా వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి ఆ క్యాబ్ ముందుకు వెళ్లిందా మహిళ. అతడు సడన్ బ్రేక్ వేయకపోతే.. ఆమె పని అయిపోయేదే. అయితే.. సదరు క్యాబ్ డ్రైవర్ కిందకు దిగిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.

అతడే రూల్స్ పాటించకుడా దూసుకొచ్చాడని ఆరోపిస్తూ.. క్యాబ్ డ్రైవర్ ను కొట్టడం మొదలు పెట్టింది ఆ మహిళ. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు సహా.. ఉన్నవారంతా నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. అంతేకాదు.. ఆ డ్రైవర్ ఫోన్ పగలగొట్టింది. కారులో ఉన్న డబ్బులు 600 తీసుకుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆ యువతిని క్యాబ్ డ్రైవర్ ను అందులో ఉన్న ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. స్టేషన్ కు వెళ్లిన తర్వాత తప్పంతా డ్రైవర్ దేనని చెప్పడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

అయితే.. ఆ తర్వాత విడుదలైన సీసీ కెమెరా ఫుటేజీ చూసిన వారంతా.. ఆ యువతిదే తప్పు ఉన్నట్టుగా కనిపిస్తోందని అన్యాయంగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. #ArrestLucknowGirl అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. పోలీసులు కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా.. బాధితుడిపైనే ఎలా కేసు పెడతారని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో.. ఎట్టకేలకు సదరు యువతిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరాడు.