Begin typing your search above and press return to search.

ఎట్ హోం : తెలుగు రాష్ట్రాలలో ఎందుకంత చర్చ అయింది...?

By:  Tupaki Desk   |   16 Aug 2022 6:46 AM GMT
ఎట్ హోం : తెలుగు రాష్ట్రాలలో ఎందుకంత చర్చ అయింది...?
X
స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయా రాష్ట్రాలలో గవర్నర్లు రాజ్ భవన్ నిర్వహించే తేనీటి విందుకు ఎట్ హోం అని పేరు పెట్టారు. ఇది ఒక మంచి సంప్రదాయంగా వస్తోంది. ఆగస్ట్ 15న ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగరేస్తారు. గవర్నర్లు రిపబ్లిక్ డేన జెండా ఆవిష్క‌రణ చేస్తారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున గవర్నర్లు తమ ప్రభుత్వమని చెప్పబడే రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిచి తేనీటి విందు ఇస్తారు . అలాగే విపక్ష నేత సహా రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తారు.

అలాగే మేధావులు, వివిధ రంగాల నిపుణులు అందరితో కలసి తేనీటి విందు ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతుంది. సాధారణంగా ఇది మంచి సంప్రదాయం. ఇక్కడ అందరూ కలసి అహ్లాదకరంగా భేటీలు వేసుకుంటారు. ఒక విధంగా నిత్య రాజకీయాల్లో దూషణ భూషణ పర్వాలు ఉంటే వాటి సెగలు ఇంకా పెరగకుండా తగ్గించడానికి అపార్ధాలు తొలగిపోవడానికి కూడా ఎట్ హోం వంటి కార్యక్రమాలు దోహదపడతాయి.

గవర్నర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పెద్ద. ఆయన ఆదేశానుసారమే మంత్రి వర్గం పనిచేస్తుంది. కాబట్టి ఆ పెద్ద సమక్షంలో అంతా కలసి మాట్లాడుకోవడం ద్వారా అపార్ధాలు తొలగి యధార్ధాలు తెలుస్తాయి. గతంలో అయితే ఎట్ హోం కి అందరూ హాజరయ్యేవారు. అక్కడ ప్రముఖుల భేటీలు, వారి కరచాలనాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. వారి పలకరింపులు ఆప్యాయతలు అన్నీ కూడా సాదర జనంలోనూ ఆయా పార్టీల కార్యకర్తలలోనూ స్నేహ భావాన్ని పెంపొందించేలా ఉండేవి.

ఎన్టీయార్ సీఎం గా ఉండగా నాటి ఉమ్మడి ఏపీ గవర్నర్ కుముద్ బెన్ జోషి ఇచ్చిన ఎట్ హోం కి ఎన్టీయార్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు. అప్పటికే కాంగ్రెస్ నియమించిన కుముద్ బెన్ జోషీ విషయంలో తెలుగుదేశంలో కొంత భిన్న అభిప్రాయాలు ఉండేవి. ఆమె కేంద్ర ప్రభుత్వం దూత అని కూడా అనుమానించిన సందర్భాలు ఉండేవి. ఆమె పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నేత అయినా కూడా రాష్ట్ర గవర్నర్ గా గౌరవించి ఎన్టీయార్ రాజ్ భవన్ కి ఎట్ హోం కర్యక్రమానికి వెళ్ళి తేనీటి విందులో పాలుపంచుకున్నారు.

ఇక నాడు రాజ్ భవన్ ఎట్ హోం కి కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. సినీ రంగం నుంచి కూడా కాంగ్రెస్ సానుభూతిపరులుగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ క్రిష్ణ వంటి వారు కూడా అటెండ్ అయ్యారు. అంతా కలసి రాజకీయాలు మరచి ఆప్యాయంగా మాట్లాడుకోవడం నాటి ముచ్చట. ఆ తరువాత కూడా చంద్రబాబు సీఎం గా ఉండగా వైఎస్సార్, వైఎస్సార్ సీఎం గా ఉండగా చంద్రబాబు ఎట్ హోం వెళ్లి పరస్పరం నవ్వులు చిందితూ కనిపించేవారు. తామంతా ఒక్కటే అన్న భావన కలిగించేవారు.

అయితే రాను రాను రాజకీయాల్లో వ్యక్తిగతాలు ఎక్కువ అయిపోయి ఎట్ హోం లాంటి మంచి సంప్రదాయాలు కూడా వివాదస్పదం అవుతున్నాయి అన్న భావన ఏర్పడుతోంది. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎట్ హోం లో అనేక విషయాలు ఫోకస్ అయ్యాయి. తెలంగాణానే తీసుకుంటే ముందుగా వస్తాను అని సమాచారం ఇచ్చిన సీఎం కేసీయార్ చివరి నిముషంలో రాలేదు. ఆయన మంత్రులూ రాలేదు, దాంతో సీఎం కేసీయార్ కోసం గవ‌ర్నర్ తమిళ్ సై, ఇతర ప్రముఖులు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఇక ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా హాజరు అయ్యారు. అలాగే విపక్ష నేత చంద్రబాబు వచ్చారు. కానీ ఈ ఇద్దరూ ఎదురు పడలేదు, పలకరించుకోలేదు. కనీసం దూరం నుంచి కూడా విష్ చేసుకోలేదు. దీనిని చూసిన వారు ఏమిటిది అని విస్తుపోయే పరిస్థితి. ఈ ఇద్దరిలో ఎవరు తగ్గినా ఎట్ హోం కి ఫలితం ఉండేది. బాబు వయసులో పెద్దవారు. తన తండ్రి సమకాలీనుడు. అలా ఆయనకు జగన్ గౌరవం ఇచ్చినా ఆయన ఇంకా ఎత్తున జనం గుండెల్లొ నిలిచేవారు.

ఇక బాబు కూడా నాలుగు దశాబ్దాల అనుభవం తనకు ఉంది, ఇవేమిటి చిన్న విషయాలు అంటూ జగన్ తో చేతులు కలిపినా జనాలు హర్షించేవారు. కానీ ఇద్దరూ ఎవరి టేబిళ్ల వద్ద వారు పరిమితమై కూర్చోవడం చూస్తే తెలుగు రాజకీయాల్లో ఎంతటి వ్యక్తిగత వైరం సాగుతోందా అనిపించేలా పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ధోరణి మారితే ప్రజలకు, నాయకులకూ పార్టీలకూ మేలు మారకపొతే మాత్రం అందరికీ నష్టమే అని చెప్పక తప్పదు.