సల్మాన్ రష్దీ మీద హత్యాయత్నం.. మౌనం వీడిన ఇరాన్

Mon Aug 15 2022 20:00:01 GMT+0530 (IST)

Assassination attempt on Salman Rushdie

ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ మీద న్యూయార్కులో జరిగిన హత్యాయత్నంపై పెద్ద ఎత్తున ఖండనలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇరాన్ మాత్రం మౌనంగా ఉండటం.. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.బుకర్ ప్రైజ్ రచయితగా.. భారత సంతతికి చెందిన రష్దీ గతంలో రాసిన శటానిక్ వర్సెస్ పుస్తకంపై ఇరాన్ మండిపడటం.. అప్పట్లో దాని అధినేత అతనిపై మరణ ఫత్వాను జారీ చేయటం తెలిసిందే.

తాజాగా రష్దీ మీద దాడి విషయంలో పలువురు ఇరాన్ ను వేలెత్తి చూపటమే కాదు.. విమర్శలు గుప్పిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఇరాన్ ఈ ఇష్యూ మీద స్పందించింది. ఈ దాడి విషయంలో తప్పు పట్టాల్సింది రష్దీ మద్దతుదారులేననే అంటూ ప్రకటన విడుదల చేసింది. వాక్ స్వాతంత్య్రం అనేది తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాల్ని ఎంత మాత్రం సమర్ధించదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ స్పష్టం చేశారు.

ఇస్లాం పవిత్రతను అవమానించటం ద్వారా ఆయన కోట్ల మంది ఉన్న ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారని.. దాడికి ఆయన్ను.. ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేమన్నారు. అదే సమయంలో దాడి విషయంలో ఇరాన్ ను నిందించే హక్కు ఎవరికి లేదన్నారు.

అసలు ఆ విషయం తమకు సంబంధం లేదన్న నాజర్ కు.. మరి హత్యాయత్నం చేసిన నిందితుడ్ని పొగుడుతూ వెలువడిన కథనాల మాటేమిటి? అన్న ప్రశ్నను వేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. అలాంటి కథనాలు ప్రచురితమైనది మాజీ అధ్యక్షుడు అయతొల్లా రుహోల్లాహ్ కు చెందిన మీడియా సంస్థలోనేనని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రజాభిప్రాయాల్ని తప్పు పట్టటం సాధ్యం కాదని తేల్చారు. మొత్తానికి ఇంతకాలం మౌనంగా ఉన్న ఇరాన్.. తాజాగా ఈ ఇష్యూ మీద రియాక్టు అయ్యింది.