పంద్రాగస్టు వేళ ఆ రాష్ట్ర సీఎం సంచలన ప్రకటన.. లక్ష కేసులు మాఫీ

Tue Aug 16 2022 10:32:10 GMT+0530 (IST)

Assam Chief Minister Himanta Biswasar

సంచలన ప్రకటన చేశారు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్. పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించిన ప్రసంగించిన సమయంలో ఆయన.. మిగిలిన సీఎంలకు భిన్నంగా వ్యవహరించారు. వజ్రోత్సవ కానుకగా ఆయన.. లక్ష కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పి సంచలనంగా మారారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న కేసుల్ని తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లుగా వెల్లడించారు.కోర్టుల్లో పని ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా సోషల్ మీడియా పోస్టులు.. చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్ని వెనక్కి తీసుకొని.. వాటిని క్లోజ్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కిందిస్థాయి కోర్టుల్లో దాదాపు 4.5 లక్షల కేసులు ఉన్నాయని.. వాటి కారణంగా కింది కోర్టుల్లో తీవ్రమైన పని ఒత్తిడి నెలకొన్నట్లు చెప్పారు. అందుకే.. తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

ఆగస్టు 14 అర్థరాత్రి వరకు నమోదైన లక్ష మైనర్ కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా పేర్కొన్నారు. అత్యాచారం.. హత్య వంటి క్రూరమైన నేరాల్ని మరింతగా ఫోకస్ చేసేందుకు న్యాయవ్యవస్థకు తమ నిర్ణయం వీలు కల్పిస్తుందని చెప్పారు. అంతేకాదు..న్యాయవాదులు అందుబాటులో లేక ఎవరైనా అమాయకులు జైళ్లలో మగ్గుతుంటే అలాంటి వారిని తక్షణమే విడుదల చేస్తామన్నారు. ఏమైనా సింగిల్ ప్రకటనతో ఏకంగా లక్ష కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవటం ఆసక్తికరంగా మారింది. దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ప్రభుత్వం కేసుల్ని వెనక్కి తీసుకుంటుందన్న విషయాన్ని వెల్లడించటం లేదని చెబుతున్నారు.