అస్సాంలో సంచలనం.. జైలు నుంచే గెలుపొందిన నేత!

Tue May 04 2021 14:01:06 GMT+0530 (IST)

Assam Assembly elections 2021

దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా అస్సాంలో ఉద్యమించి జైలులో ఉన్న అఖిల్ గొగోయి.. దేశ రాజకీయాల్లో తనదైన చరిత్ర సృష్టించారు. ఆయన జైలు నుంచే ఎన్నికల్లో పోటీచేసి.. ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 11875 ఓట్ల మెజారిటీతో గెలుపు జెండా ఎగరేశారు.అఖిల్ గొగోయి జైలు ఉండడంతో ప్రచారం కూడా నిర్వహించలేకపోయారు. దీంతో.. ఆయన ప్రచార బాధ్యతలను 85 తల్లి తీసుకోవడం గమనార్హం. ఈ వయసులోనూ ఆమె ప్రజల్లో తిరిగి తన కుమారుడిని గెలిపించాలని కోరారు. సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్ తదితరులు కూడా ఆమె వెంట నడిచారు.

సీఏఏకు వ్యతిరేకంగా అస్సాంలో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. దీనికి అఖిల్ గొగొయి కారణమని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. అతన్ని అరెస్టు చేసి దేశద్రోహం నేరం కూడా మోపింది.

ఈ నేపథ్యంలోనే అఖిల్ గొగోయి రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘రైజోర్ దళ్’ పేరుతో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో ఎంతోమంది యువకులు చేరారు. వారంతా ఇంటింటికీ తిరుగుతూ అఖిల్ విజయానికి కృషి చేశారు. దాంతో.. జైలులోంచే ఘన విజయం సాధించారు గొగోయి. 1977లో జార్జి ఫెర్నాండ్ కూడా జైలు నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత ఖైదీగా జైల్లో ఉండి ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి గొగోయి మాత్రమే.