Begin typing your search above and press return to search.

అచ్చూ కేసీఆర్ లాగానే...ఆస్ప‌త్రిలోనే దీక్ష!

By:  Tupaki Desk   |   18 Nov 2019 9:44 AM GMT
అచ్చూ కేసీఆర్ లాగానే...ఆస్ప‌త్రిలోనే దీక్ష!
X
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె...రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. తమ డిమాండ్ల నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 45వ రోజుకు చేరుకుంది. అయితే సమ్మె చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. మ‌రోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న నిరాహార దీక్షలు - వారికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన ‘సబ్బండ వర్ణాల మహా దీక్ష’లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇదిలాఉండ‌గా - ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, ఆయ‌న ఆస్ప‌త్రిలో కూడా దీక్ష కొన‌సాగిస్తున్నారు.

రెండు రోజులుగా ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డితో పాటు మరో 20 మంది మహిళా కార్మికులు కూడా దీక్ష చేస్తున్నారు. వాళ్లందరికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి హెల్త్ కండీషన్ బాగోలేదని డాక్టర్లు చెప్పడంతో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు చర్చలు జరిపారు. అయితే అశ్వత్థామరెడ్డి మాత్రం దీక్ష విరమించనని తేల్చి చెప్పారు. దీంతో అశ్వత్థామరెడ్డితో స‌హా పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్‌కు తరలించగా...ఆస్ప‌త్రిలో కూడా ఆయ‌న దీక్ష కొన‌సాగిస్తున్నారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో కేసీఆర్ సైతం చికిత్స‌కు నిరాక‌రించి...దీక్ష కొన‌సాగించ‌న‌ట్లే త‌మ ప‌క్షాన అశ్వ‌త్థామ‌రెడ్డి సైతం అదే ప‌ట్టుతో ఉన్నార‌ని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.

కాగా, ‘సబ్బండ వర్ణాల మహా దీక్ష’ ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ జేఏసీ నేతలను - ఎమ్మార్పీఎస్ నేతలు - కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇందిరా పార్క్ ప్రాంతాన్ని పోలీసులు - ముళ్ల కంచెలు - బారికేడ్లతో దిగ్బంధం చేశారు. రోడ్లను మూసేసి స్థానికులను కూడా వెళ్లనివ్వలేదు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి - కో–కన్వీనర్ రాజిరెడ్డిని - మహిళా కార్మికులను అరెస్టు చేశారు. మందకృష్ణను - ఎమ్మార్పీఎస్ నేతలనూ అదుపులోకి తీసుకున్నారు.