Begin typing your search above and press return to search.

బీజేపీ వైపు చూస్తున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   15 Dec 2019 7:33 AM GMT
బీజేపీ వైపు చూస్తున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే
X
వైసీపీ ప్రభంజనాన్ని ఎదుర్కొన్ని శ్రీకాకుళం జిల్లాలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయన్ను సంప్రదించారని.. వారితో అశోక్ చర్చలు జరిపారని వినిపిస్తోంది. అయితే, తన వెంట ఉన్న నాయకుల్లో కొందరి నుంచి దీనిపై సానుకూలత రాకపోవడంతో అశోక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

టీడీపీకే చెందిన ఓ కీలక ఎంపీ ద్వారానే బీజేపీ - అశోక్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. నిజానికి అశోక్‌ కు జిల్లా దాటి పెద్దగా రాజకీయ పరిచయాలు లేవు. అశోక తండ్రి బెందాళం ప్రకాశం కాలం నుంచి ఆ కుటుంబం టీడీపీతోనే ఉంది. 2014 ఎన్నికల్లో అశోక్ తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు.

యువకుడు - వైద్యుడు అయిన అశోక్‌ కు ఇచ్చాపురంలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ మధ్య పొత్తు ఉండడంతో ఇచ్ఛాపురం సీటును బీజేపీకి ఇవ్వబోయింది టీడీపీ. కానీ.. ఇచ్చాపురం టీడీపీ నాయకులు - కింజరాపు కుటుంబం గట్టి పట్టు పట్టడంతో ఇచ్ఛాపురం టీడీపీకే కేటాయించారు. దాంతో బెందాళం అశోక్ అక్కడి నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచారు. అదే ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన నాయుడితో స్నేహం ఆయన్ను రాజకీయాల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లింది. తిత్లీ - ఫొని తుపాను సమయాల్లో దెబ్బతిన్న నియోజకవర్గంలో ఆయన ఊరూరూ తిరిగి ప్రజల మన్ననలు పొందారు. దాంతో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచారు.

అయితే, ఇప్పుడు టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఉండడంతో ఆయన బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఓ ఎంపీ ఆయన్ను బీజేపీకి చేరువ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంతవరకు బీజేపీ కానీ - బెందాళం అశోక్ కానీ స్పష్టత ఇవ్వలేదు.