ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోన్న ‘బాబ్రీ జిందా హై’ !

Wed Aug 05 2020 22:51:53 GMT+0530 (IST)

'Babri Zinda Hai' trending on Twitter!

గత కొన్ని దశాబ్దాలుగా హిందువులందరు ఎదురుచూస్తున్న ఆ అపురూప ఘట్టం ఆవిష్కృతం అయింది. దేశం మొత్తం రామనామ స్మరణతో మరోమోగిపోయింది. దేశ ప్రధాని హోదాలో మోడీ అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఈ అపురూప ఘట్టం పై మోదీ సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో ట్విట్టర్ లో " బాబ్రీ జిందా హై " హ్యాష్ ట్యాగ్ ఇండియా టాప్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. బాబ్రీ జిందా హై అంటే .. బాబ్రీ మసీదు ఇంకా బతికే ఉంది అని అర్థం.అప్పటి బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన విషయాల్ని తెలియయజేస్తూ కొందరు సోషల్ మీడియా లో ట్విట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బాబ్రీ జిందా హై హ్యాష్ ట్యాగ్ పై ట్వీట్ చేశారు. బాబ్రీ మసీదు పాత చిత్రం మసీదు కూల్చివేత సమయంలో తీసిన చిత్రం.. రెండింటినీ కలిపి తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో షేర్ చేశారు. ఆ తరువాత ‘‘బాబ్రీ మసీదు ఉండేది..ఉంది .. ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే మరికొందరు కూడా సోషల్ మీడియా ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్స్ చేస్తున్నారు. ‘‘బాబ్రీ మసీదు.. మసీదుగా ఉంది. ఎప్పటికీ మసీదుగానే ఉంటుంది. మా తర్వాతి తరాల వారికి ఇదే విషయాన్ని చెబుతాం’’ అని ఓ నెటిజెన్ ట్విట్ చేసాడు. భారత మీడియా అధికార వ్యవస్థలు బీజేపీ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలకు ఎత్తుగడలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చాలామంది ఈ సమయంలో ఆరోపణలు చేస్తున్నారు.

ఇక స్థల వివాదం గురించి చూస్తే .. 16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదును 1992లో కూల్చి వేశారు. మసీదు ఉన్న స్థలంలో అంతకుముందు రామమందిరం ఉండేదని మోఘలాయిల పాలనలో ఆ రామమందిరాన్ని నాశనం చేసి మసీదు నిర్మించారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్నేళ్లుగా కోర్టులో ఉన్న ఈ వివాదానికి గతేడాది సుప్రీం ముగింపు పలికింది. వివాదస్పద స్థలంలో మందిర నిర్మాణానికి అనుమతినిస్తూ.. మసీదుకు అయోధ్య లోనే మరోచోట స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.