Begin typing your search above and press return to search.

మోడీ.. రాహుల్ ఇద్దరిని కలిపి తిట్టేసిన అసద్

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:51 AM GMT
మోడీ.. రాహుల్ ఇద్దరిని కలిపి తిట్టేసిన అసద్
X
రక్తం మరిగిపోయేలా ప్రసంగాలు చేస్తూ.. మాటలతో ఉత్తేజితుల్ని చేసే నైపుణ్యం ఉన్న రాజకీయ నేతలు కొద్దిమందే కనిపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి నేతలు చాలా తక్కువమందిగా చెప్పాలి. బాష అర్థం కాకున్నా.. ఏదో ఆవేశపూరితంగా ఇస్తున్న సందేశంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పీచులు విన్నప్పుడు అర్థమవుతుంటుంది. ఆయన చేసే ఉర్దూ ప్రసంగం అర్థం కాకున్నా.. ఆయన స్పీచ్ లో ఉండే రిథమ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్.. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు కాంగ్రెస్ పార్టీ దయతో జీవితంచటం లేదని మండిపడ్డ ఆయన.. భారత రాజ్యాంగం.. అల్లా దయతోనే తాము బతుకుతున్నట్లు చెప్పారు.

మహారాష్ట్రలోని భీవండి పశ్చిమ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసే క్రమంలో మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో పడవ మునిగిపోతున్న సమయంలో కెప్టెన్ అనేవాడు అందరిని కాపాడి తన గురించి తర్వాత ఆలోచిస్తాడు. కానీ.. కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ గా ఉన్న రాహుల్ మాత్రం పడవ మునిగిపోతున్న వేళ.. అర్థంతరంగా పారిపోయారన్నారు.

మోడీ పాలనతో దేశంలో చీకట్లు నెలకొన్నాయని.. కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం మహిళల ప్రయోజనాల్ని కాలరాసే రీతిలో ఉందన్నారు. బీజేపీ పాలన అంటేనే చీకటిగా ఆయన అభివర్ణించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21న జరుగుతుండగా.. ఫలితాలు 24న విడుదల కానున్నాయి.