జైలు నుంచి ఇంటికి ఫోన్ చేసిన ఆర్యన్.. ఏం జరిగిందంటే?

Sat Oct 16 2021 08:47:17 GMT+0530 (IST)

Aryan Call To home from jail

నిషేధిత డ్రగ్స్ ను కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి ఇంటికి వీడియో కాల్ లో మాట్లాడారు. ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డులో ఉన్న జైల్లో ఉన్న అతను.. ఇంటికి వీడియో కాల్ చేసే సదుపాయం రావటంతో.. తల్లి గౌరీఖాన్ కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా తీవ్రమైన భావోద్వేగం చోటు చేసుకుందని చెబుతున్నారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల నుంచి దేశం బయటకు రాని నేపథ్యంలో.. జైళ్లలోని ఖైదీల్ని.. రిమాండ్ లో ఉన్న వారితో సహా ఎవరిని కలిసేందుకు అనుమతించటం లేదు. ఈ నేపథ్యంలో నెలకు రెండు..మూడుసార్లు వారు తమ వారికి ఫోన్ చేసి మాట్లాడుకునే అవకాశం ఉంది.ఈ సదుపాయాన్ని తాజాగా షారుక్ కుమారుడికి ఇచ్చారు. ఫోన్ మాట్లాడే అవకాశం ఇవ్వటంతో ఆర్యన్.. తన తల్లికి ఫోన్ చేశారు. కొడుకుతో గౌరీ ఖాన్ తో పాటు.. షారుక్ కూడా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. దీంతో.. తీవ్రమైన భావోద్వేగంతో అక్కడి వాతావరణం ఉందని చెబుతున్నారు.

దాదాపు పది నిమిషాల పాటు వీడియో కాల్ లో మాట్లాడుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. తన తల్లితో ఫోన్ మాట్లాడేంతసేపు ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫోన్ మాట్లాడుతున్నంతసేపు వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అరెస్టు చేశారు. అనంతరం అందరిని రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు పలుమార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు.

మరోవైపు..ఆర్యన్ ఖాన్ అరెస్టుపై బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు.. ఆవేదన వ్యక్తం చేయటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. జైలు నుంచి ఆర్యన్ చేసిన ఫోన్ కాల్.. అతడి తల్లిదండ్రులకు తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.