Begin typing your search above and press return to search.

మొన్న సుష్మా..నేడు జైట్లీ..బీజేపీకి దెబ్బ‌మీద దెబ్బ‌!

By:  Tupaki Desk   |   24 Aug 2019 8:12 AM GMT
మొన్న సుష్మా..నేడు జైట్లీ..బీజేపీకి దెబ్బ‌మీద దెబ్బ‌!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఏడాది అచ్చిరాలేదా? అంటే.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌రుసగా రెండో సారి అత్య‌ధిక మెజారిటీతో అందుకున్న విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న క్రమంలో కీల‌క నాయ‌కులు ఒక్కొరొక్క‌రుగా రాలిపోతున్న ఘ‌ట‌న పార్టీని అయోమ‌యంలోకి నెడుతోంది. ఈ నెల‌లోనే కీల‌క నాయ‌కురాలు సుష్మాస్వ‌రాజ్‌.. అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. ఆ బాధ నుంచే పార్టీ ఇంకా కోలుకోలేదు.

ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క నాయ‌కుడు - ప్ర‌ముఖ న్యాయ‌వాది అరుణ్ జైట్లీ శ‌నివారం ఉద‌యం మృతి చెందారు. దీంతో పార్టీలో తీవ్ర దిగ్భ్రాంతిక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 9న ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు.

ఎమర్జెన్సీ టైమ్‌ లో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన టైమ్‌ లో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌ గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా పనిచేశారు.

ఏపీతో అనుబంధం..

శ‌నివారం ఉద‌యం మృతి చెందిన అరుణ్ జైట్లీకి ఏపీతో ప్ర‌త్యేక మైన అనుబంధం ఉంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి సంబందించిన విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ప్ర‌త్యేకంగా అధ్య‌య‌నం చేసిన నాయ‌కుడిగా అరుణ్ జైట్లీ గుర్తింపు సాధించారు. ప్ర‌తి విష‌యాన్ని సూక్ష్మంగా ప‌రిశీలించిన ఆయ‌న విభ‌జ‌న ద్వారా వ‌చ్చే అన్ని లాభాల‌ను ప్యాకేజీ రూపంలో ఇస్తామ‌ని - ఏపీకి అన్నివిధాలా సాయం చేస్తామంటూ.. ఢిల్లీలో ప్ర‌క‌టించిన ఏకైక నాయ‌కుడు అరుణ్ జైట్లీ.

మాజీ ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అదేస‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన నాయ‌కుడు కూడా ఈయ‌నేకావ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. బీజేపీకి అత్యంత కీల‌క నాయ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందిన జైట్లీ మ‌ర‌ణంపై క‌మ‌ల నాథులు క‌న్నీరుమున్నీరవుతున్నారు.