అజ్మేర్ దర్గా మత గురువు అరెస్టు.. సంచలన వ్యాఖ్యల ఫలితం!

Wed Jul 06 2022 15:28:17 GMT+0530 (IST)

Arrest of Ajmer Dargah Senstational comments

బీజేపీ మాజీ ప్రతినిధి నుపుర్ శర్మ తల నరికి తెచ్చి ఇచ్చినవారికి తన ఇల్లును రాసి ఇచ్చేస్తానని రెచ్చగొ ట్టే వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గా మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ తల నరికినవాళ్లకు తన ఇంటిని బహుమతిగా ఇస్తానని అజ్మేర్ దర్గా మత గురువు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

దీంతో రాజస్థాన్ పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. దర్గా ఖాదిమ్ సల్మాన్ చిశ్తీ  వీడియోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి ఇదివరకే నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

''మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నాం. ఖాదిమ్ మొహల్లాలోని అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నాం. జూన్ 28(ఉదయ్పుర్ హత్య జరిగిన తేదీ)కు ముందే వీడియో తీసినట్టు నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత వీడియో లీక్ అయిందని తెలిపాడు. మద్యం మత్తులో ఈ వ్యాఖ్యలు చేసి వీడియో తీశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాం'' అని పోలీసులు చెప్పారు.

వ్యక్తిగతమైన ఆ వ్యాఖ్యలతో దర్గాకు సంబంధం లేదని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజ్మేర్ కార్యాలయ ప్రతినిధి దివాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గా పీఠానికి ఆ వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

మరోవైపు కొంతమంది వ్యక్తులు అజ్మేర్ దర్గా వద్ద జూన్ 17న రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఇదివరకే గుర్తించారు. ఈ కేసులో గతవారం నలుగురిని అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న అజ్మేర్ దర్గా ఇలా వివాదం కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తుండడం గమనార్హం.