Begin typing your search above and press return to search.

కరోనా భయంతో సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా ... అయితే మీకో షాకింగ్ న్యూస్ !

By:  Tupaki Desk   |   4 May 2021 10:30 AM GMT
కరోనా భయంతో సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా ... అయితే మీకో షాకింగ్ న్యూస్ !
X
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎక్కువగా వినిపిస్తున్న కరోనా నిర్ధారిత టెస్టుల్లో సీటీ స్కాన్ కూడా ఒకటి. ఆర్‌ టీపీసీఆర్ టెస్టుల్లో వాస్తవికత ఉండటం లేదని, కొన్నిసార్లు నెగిటివ్ వచ్చిన వారికి పాజిటివ్‌ గా, పాజిటివ్ వచ్చిన వారికి నెగిటివ్‌ గా చూపిస్తున్నాయనే ప్రచారం జరుగుతుండటంతో సిటీ స్కాన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌తో పోల్చుకుంటే సీటీ స్కాన్ ఖర్చుతో కూడుకున్నప్పటికీ కచ్చితమైన ఫలితాలు సీటీ స్కాన్ చేస్తే తెలిసిపోతాయనే నమ్మకంతో ఆసుపత్రులకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే , సిటీ స్కాన్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

లక్షణాలు లేని 30-40 శాతం మందిలో సీటీ స్కాన్ చేయించుకుంటే కరోనా వైరస్ పాజిటివ్ అనే వస్తోందని పలు అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. అలాగే, అందులో కనిపించే ప్యాచ్‌ లు ఎలాంటి చికిత్స లేకున్నా మాయమైపోతాయన్నారు. సీటీ స్కాన్ చేయించుకున్న క్రమంలో వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముందని తెలిపారు. ఒక్క సిటీ స్కాన్ 300 నుంచి 400 ఛాతి ఎక్స్-రే పరీక్షలకు సమానమని.. పదేపదే సీటీ స్కాన్ చేయడం వల్ల యువతకు కూడా క్యాన్సర్ ముప్పు ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. తక్కువ లక్షణాలు కనిపించిన వారు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సీటీ స్కాన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు 30 నుంచి 40 శాతం మంది లక్షణాలు లేని వారేనని తెలిపారు.

స్వల్ప లక్షణాలు కనిపించిన వారు హోం ఐసోలేషన్ పాటిస్తే సరిపోతుందని, సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని భావిస్తే ఎక్స్-రే చేయించుకుంటే సరిపోతుందని.. సీటీ స్కాన్‌ వరకూ వెళ్లొద్దని ఆయన సూచించారు. సీటీ స్కాన్‌ లో పాజిటివ్‌ గా తేలిన 30 నుంచి 40 శాతం మందికి ఎలాంటి ట్రీట్‌ మెంట్ అవసరం లేకుండానే కరోనా నయమవుతోందని చెప్పారు. బయోమేకర్స్ కూడా చాలా ప్రమాదమని, వైద్యుల సలహా మేరకే సీటీ స్కాన్ చేయించుకోవాలని తెలిపారు. సీటీ స్కాన్ అనేది కంప్యూటెడ్ టోమోగ్రఫీ టెస్టింగ్ విధానం. చెస్ట్ లేదా బ్రెయిన్‌ను స్కాన్ చేయడానికి ఈ విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. సీటీ స్కాన్స్‌లో మొత్తం 11 రకాలున్నాయి. ఊపిరితిత్తుల వరకూ కరోనా వైరస్ కారణంగా ఇన్‌ఫెక్షన్ చేరిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి చేస్తారు.