Begin typing your search above and press return to search.

సారు కంట్లో పడాలంటే రోడ్డు మీద నిలుచోవాలా?

By:  Tupaki Desk   |   28 Feb 2020 9:30 PM GMT
సారు కంట్లో పడాలంటే రోడ్డు మీద నిలుచోవాలా?
X
తన కార్యాలయానికి వచ్చిన పండుటాకు గురించి తెలిసి.. తన ఛాంబర్ విడిచి.. సమస్యను విని పరిష్కరిస్తామన్న హామీని ఇచ్చిన కలెక్టర్ ను తెలంగాణలో చూశాం. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సదరు కలెక్టర్ మీద ప్రశంసల వర్షం కురిసింది. రోజు గడిచిందో లేదో? సీఎం కేసీఆర్ సైతం తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనలోని పెద్ద మనసును యావత్ తెలంగాణ ప్రజలకు చూపించటమే కాదు.. సమస్యలతో ఉన్నోళ్లు చేయాల్సిందేమిటన్న విషయాన్ని పరోక్షంగా సంకేతాల్ని ఇచ్చారా? అన్నది ప్రశ్నగా మారింది.

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దాన్లో తప్పేమీ లేదు. కానీ.. సమస్య అంతా ఇలా సమస్యలున్న వారి విషయంలో వ్యవస్థ ఎందుకు పని చేయటం లేదు? అన్నది ప్రశ్న. సారు మూడ్ బాగుండి.. ఫోన్ ఏదీ మాట్లాడకుండా.. యథాలాపంగా రోడ్డు మీద చూసినప్పుడు సలీమ్ దీన స్థితి ఆకర్షించి ఉండొచ్చు. కానీ.. అలాంటి అవకాశం అన్ని సందర్భాల్లో ఉంటాయన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. నాటకీయ పరిణామాలు రాజకీయ మైలేజీ ఇవ్వొచ్చు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను మరింత పెరిగే వీలుంటుంది. దానివల్ల సమస్యల్లో ఉన్న వారికిఎలాంటి ప్రయోజనం కలుగదు.

ఎప్పుడో ఒకసారి తాను బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సిత్రాలతో మనసుల్ని దోచుకునే బదులు.. ప్రతిరోజూ ప్రగతిభవన్ లోనే ఒక గంట సేపు కష్టాల్లో ఉన్న వారికి కేటాయిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది కదా? అలాంటి వాటి మీద కేసీఆర్ దృష్టి ఎందుకు పెట్టటం లేదన్నది పెద్ద విషయం. సమస్యల్ని విన్నంతనే చలించిపోయి.. వారికి సాధ్యమైనంత సాయం అందించాలన్న తపన ఉన్న ఆయన.. ఎందుకీ పని చేయటం లేదన్నది ప్రశ్న.

తాజా ఎపిసోడ్ చూస్తే.. ప్రైవేటు కార్యక్రమం వెళ్లిన కేసీఆర్ తిరుగు ప్రయాణంలో రోడ్డు మీద వినతిపత్రం పట్టుకొని నిలుచున్న ఒక పేదజీవి కేసీఆర్ కంటికి ఎలా కనిపించారన్నది ఆశ్చర్యకరమే. ఎందుకంటే.. తక్కువలో తక్కువ సీఎం కాన్వాయ్ గంటకు 50 నుంచి 70 కి.మీ. వేగంతో వెళుతుంది. అంత వేగంలోనూ సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆయన గుర్తించారంటే సామాన్యమైన విషయం కాదు కదా? ఇంతటి సునిశిత పరిశీలన ఉన్న వారు మరింత ప్రయత్నిస్తే.. ఎంతోమందికి సాయం అందుతుందనటంలో సందేహం లేదు.

సమస్యలతో కొట్టుమిట్టాడే వారు.. అపన్నహస్తం కోసం ఎదురుచూసే వారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రోడ్ల మీద వినతిపత్రం పట్టుకొని ఆయన చూపు తన మీద ఎప్పుడు పడుతుందా? అన్నట్లు వెయిట్ చేయటంలో అర్థం లేదు. రోడ్డు మీద ఎదురుచూసే దాని కంటే.. ప్రగతిభవన్ కు రమ్మని చెబితే మరింత బాగుంటుంది కదా? ఆ విషయాన్ని సారు మనసులోకి తీసుకుంటారంటారా?