Begin typing your search above and press return to search.

క్షత్రియుల్లో విభేదాలొచ్చాయా ?

By:  Tupaki Desk   |   23 Jun 2021 1:30 PM GMT
క్షత్రియుల్లో విభేదాలొచ్చాయా ?
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. మాన్సాస్ ట్రస్టు కేంద్రంగా మొదలైన వివాదం చివరకు క్షత్రియ సామాజికవర్గంలోనే చీలిక వచ్చినట్లు సమాచారం. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర క్షత్రియులు, ఇతర ప్రాంతాల క్షత్రియులుగా విడిపోయే పరిస్ధితులు తలెత్తిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మాన్సాస్ ట్రస్టుపై ఆధిపత్యం కోసం అశోక్ గజపతిరాజు కోర్టులో కేసు వేసి ప్రభుత్వంపై గెలిచారు. నిజానికి ట్రస్టు అశోక్ తండ్రి పూసపాటి విజయ రామరాజు స్ధాపించిందే అయినా ప్రస్తుతం అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. ట్రస్టు పరిధిలో ఉన్న నిధులు, భూములు తదితరాల, ఆస్తుల పరిరక్షణ పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావించింది. అందుకనే అశోక్ ను ట్రస్ట్ ఛైర్మన్ గా తొలగించి అశోక్ అన్న ఆనంద్ కూతురైన సంచైతా గజపతిరాజును ఛైర్ పర్సన్ గా నియమించింది.

ఈ నియామకంపై అశోక్ కోర్టులో కేసు వేసి గెలిచారు. కోర్టు ఆదేశాలతో మళ్ళీ ఛైర్మన్ గా నియమితులైన దగ్గర నుండి అశోక్-అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి అండ్ కో అశోక్ పై చేస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా అంటే అశోక్ కు మద్దతుగా క్షత్రియ సంఘం పేరుతో రెండు రోజుల క్రింద ఓ ప్రకటన వచ్చింది. అయితే మరుసటి రోజే అశోక్ కు వ్యతిరేకంగా మంత్రి శ్రీ రంగనాధరాజు పేరుతో మరో ప్రకటన వచ్చింది.

మంత్రి ఇచ్చిన ప్రకటన తరువాత రోజు క్షత్రియుల్లోని కొందరు ప్రముఖులు అశోక్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశంలో మంత్రితో పాటు ఉత్తరాంధ్రకే చెందిన కొందరు రాజులున్నప్పటికీ వారంతా వైసీపీ నేతలే. అయితే రాజకీయాలకు అతీతంగా చూసినా ఉత్తరాంధ్రలోని కొందరు క్షత్రియులు మాత్రమే అశోక్ కు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోని రాజులందరు అశోక్ కు వ్యతిరేకంగా ఏకమైనట్లు సమాచారం. మొత్తానికి మాన్సాస్ ట్రస్టు కేంద్రంగా మొదలైన విభేదాలు చివరకు ఎక్కడకు దారితీస్తాయో చూడాల్సిందే.