Begin typing your search above and press return to search.

ఇవన్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు కావా పవన్?

By:  Tupaki Desk   |   14 Nov 2019 11:49 AM GMT
ఇవన్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు కావా పవన్?
X
జనసేన అధినేత చెప్పే నీతులకు అనుసరించే విధానాలకు పొంతన ఉండదన్న విషయం తెలిసిందే. తనను తాను సుద్దపూసగా అభివర్ణించే ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే విషయానికి వచ్చినప్పుడు మాత్రం గతంలో తాను అన్న మాటల్ని మర్చి పోతుంటారు. తాను వ్యక్తిగత దూషణలకు దిగనని చెబుతారు. కానీ.. చేతల్లో మాత్రం అదే పని చేయటం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదా.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మీద విమర్శలు చేసే క్రమంలో ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పవన్ నాయుడు అంటూ తనకు కులాన్ని ఆపాదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ఇసుక పై తాను చెప్పే తొండి వాదనను వినిపించారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషులో బోదన విషయంలో మొదట్నించి భిన్నమైన వాదనను వినిపించే పవన్.. తాజాగా మరోసారి ఆ తరహా లోనే మాట్లాడారు.

వ్యక్తిగత వ్యాఖ్యలు చేయ నంటూనే పవన్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఆయన చెప్పే మాటలకు చేసేదాని విషయంలో అంతరం ఇట్టే అర్థం కాక మానదు. గురువారం మీడియా తో మాట్లాడిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని కీలక వ్యాఖ్యల్ని.. విమర్శల్ని చూస్తే జనసేనాని తీరు ఇట్టే అర్థం కాక మానదు.

--- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నా కూడా..కులం పేరు తగిలించుకుంటున్నారు. జగన్‌ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదు.

--- నేను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు. జాతీయ మీడియా అంతా ఆయనను అలాగే పిలుస్తుందనే విషయం ఆ పార్టీ నేతలకు తెలియదా ?

--- తాను జగన్ రెడ్డి అంటే పవన్ నాయుడు అంటూ తనకు కులం ఆపాదించేందుకు వైస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తెలుగు భాషను చంపే ప్రయత్నం చేస్తుంటే... వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారు? తామంతా ఒకటే అనే భావన తెలంగాణ ప్రజలు.. సమాజంలోఉంది. ఏపీలో మాత్రం ప్రజలు వర్గాలుగా వీడిపోయారు.

--- నన్ను తిడితే బొత్సకు రెండు నెలలు మంత్రి పదవి పెరుగుతుంది. మనుషుల్ని చంపాక ఇసుక వారోత్సవాలు చేయడం వికటాట్టహాసం. సమస్యలను పక్కదారి పట్టించడానికి వారు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.

--- మేం విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నాం. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలి.

--- తెలుగు భాషను చంపేస్తామంటే ఎలా ఊరుకుంటాం? భాషా సంస్కృతులను కాపాడలేకపోతే మట్టికొట్టుకుపోతారు. నేనీ మాటను ఆవేశంతో అనలేదు.తెలుగు భాషను అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నా.

--- పవన్ నాయుడని పిలుస్తున్నారు. పేరులో లేని పదాలను ఆపాదించటం మానుకోవాలి. ఏ కులంలోనో.. మతంలోనో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదు. కానీ.. ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లోనే ఉంది.