Begin typing your search above and press return to search.

రేవంత్ వ్యాఖ్య‌లు వ్యూహాత్మ‌క‌మా.. చారిత్ర‌క త‌ప్పిద‌మా..!

By:  Tupaki Desk   |   24 May 2022 5:30 PM GMT
రేవంత్ వ్యాఖ్య‌లు వ్యూహాత్మ‌క‌మా.. చారిత్ర‌క త‌ప్పిద‌మా..!
X
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర‌ క‌ల‌క‌లం సృష్టించాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై అన్ని రాజ‌కీయ ప‌క్షాలు అల‌ర్ట్ అయ్యాయి. రేవంత్ ఒక పార్టీకి అధ్య‌క్షుడిగా కాకుండా.. ఒక కుల సంఘం నాయ‌కుడిగా మాట్లాడార‌ని అంద‌రూ విమ‌ర్శించారు. సొంత పార్టీ నేత‌లు కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేసిన ఒక్క వ్యాఖ్య‌తో పార్టీని చంపేశార‌ని ఆక్షేపించారు. అయితే మ‌రికొన్ని వ‌ర్గాలు మాత్రం రేవంత్ వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించాయి. ఆయ‌న వ్యూహాత్మ‌కంగానే ఇలా మాట్లాడి ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

రెండు రోజుల క్రితం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని సేడం గ్రామంలో వేమారెడ్డి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో రేవంత్ పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌ రెడ్డి వ్య‌వ‌సాయం చేయాల‌ని.. వ్య‌వ‌సాయం చేస్తేనే ప‌ది మందికి సాయం చేసే ల‌క్ష‌ణం వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. దేశంలో రాజ‌కీయాలు నిల‌బెట్టింది రెడ్లేన‌ని స్ప‌ష్టం చేశారు. కాసు బ్ర‌హ్మానందరెడ్డి, నీలం సంజీవ‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వంటి నేత‌లు క్రియాశీల రాజ‌కీయాలు చేసి దేశంలో రెడ్ల ప్రాధాన్యాన్ని నిల‌బెట్టార‌న్నారు.

రెడ్ల‌ను నమ్ముకున్న ఎవ‌రూ న‌ష్ట‌పోలేద‌ని రేవంత్ పున‌రుద్ఘాటించారు. కాక‌తీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంత రాజులు నిల‌బెట్టార‌ని.. గోన గ‌న్నారెడ్డి వంటి రాజులు ఉన్నంత కాలం కాక‌తీయులు నిల‌బ‌డ్డార‌ని అన్నారు. ప్ర‌తాప రుద్రుడు రెడ్ల‌ను కాద‌ని వెల‌మ‌ల‌ను న‌మ్ముకోవ‌డంతో ఢిల్లీ సుల్తానులు కాక‌తీయ సామ్రాజ్యాన్ని కూల్చేశార‌ని తెలిపారు. ఇలా రేవంత్ ఒక వ‌ర్గానికి ప్ర‌తినిధిలాగా మాట్లాడ‌డంతో మిగ‌తా వ‌ర్గాలు భ‌గ్గుమ‌న్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఒక వైపు సామాజిక తెలంగాణ‌, సామాజిక దేశం వైపు వెళుతుంటే రేవంత్ ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం మింగుడుప‌డ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని చింత‌న్ శిబిర్ లో తీసుకున్న నిర్ణ‌యాల‌కు విరుద్ధంగా రేవంత్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ విష‌యంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామ‌ని.. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో ప్ర‌శ్నిస్తామ‌ని వీహెచ్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇత‌ర వ‌ర్గాలు కూడా రేవంత్ వ్యాఖ్య‌ల‌ను తప్పు ప‌ట్టాయి. జ‌నాభాలో 3 శాతం ఉన్న రెడ్లు ఓటు వేసుకుంటే కాంగ్రెస్ గెలుస్తుందా.. మిగ‌తా 97 శాతం ఉన్న ఇత‌ర వ‌ర్గాల ఓట్లు అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

రేవంత్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేదంటే త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే వెల‌మ వ‌ర్గానికి చెందిన కేసీఆర్ ను టార్గెట్ చేయ‌బోయి రేవంత్ త‌నే ఉచ్చులో చిక్కుకున్నార‌ని కొంద‌రు భావిస్తున్నారు. అయితే, రేవంత్ వ్యూహాత్మ‌కంగానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని.. రెడ్డి వ‌ర్గానికి చెందిన అంద‌రినీ ఏకం చేసే ఉద్దేశంతోనే మాట్లాడి ఉంటార‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మ‌రి ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో..!