జగన్ - చంద్రబాబు - పవన్ సత్తాలేని లీడర్లా?

Mon Feb 22 2021 10:29:38 GMT+0530 (IST)

Are Jagan, Chandrababu and Pawan incompetent leaders?

తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసినా.. తమిళనాడు స్టాలిన్ ను కదిలించినా.. కర్ణాటక నేతలను చూసినా కేంద్రంతో ఫైట్ అనగానే ‘టన్నులు టన్నుల దమ్మును’ చూపిస్తారు. అంతో కొంత సొంత రాష్ట్రం కోసం పోరాడుతారు. కానీ మరీ ఏపీ నేతలను చూస్తే మాత్రం కేంద్రంలోని బీజేపీకి లొంగిపోతారని..పక్క రాష్ట్రం నేతలతో పోలిస్తే చంద్రబాబు జగన్ పవన్ లు సత్తా లేని నేతలు అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. పలువురు రాజకీయ విశ్లేషకులు వీరి భయంపై సెటైర్లు వేస్తున్నారు.సొంత రాష్ట్రానికి అన్యాయం జరిగినా.. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిఘటన ఏపీ నుంచి రాకపోవడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.తమిళనాడులో జల్లికట్టుపై ఇతర కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ సహా కమల్ హాసన్ ఇతర నేతలు పెద్ద ఉద్యమమే చేశారు. ఇక కర్ణాటకలోనూ మహారాష్ట్ర తమ ప్రాంతాన్ని కొట్టేస్తోందంటే ఏకమై గట్టి వ్యతిరేకత చూపారు. కేంద్రంలోని బీజేపీతోనూ అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు డీకే లాంటివారు ఢీకొని జైలుపాలయ్యారు.

ఇక తెలంగాణలో కేసీఆర్ బీజేపీని టైం చూసి కొడుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీతో సఖ్యతతో వెళ్లి మరీ కిషన్ రెడ్డి లక్ష్మన్ ప్రసాద్ లాంటి దిగ్గజ నేతలను ఓడించారు. వ్యవసాయ చట్టాలపై ఏకంగా మంత్రులతో రోడ్లపై నిరసన చేయించారు. సమయం సందర్భం బట్టి కేసీఆర్ సైతం కాస్త గట్టిగానే ప్రవర్తిస్తారు. కేంద్రంలోని పెద్దల పిలుపుతో చల్లబడుతుంటాడు.

అయితే ఆ మాత్రం ప్రతిఘటన కూడా ఏపీ నుంచి వ్యక్తం కావడం లేదన్న ఆవేదన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపుచేయిస్తానని ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ అక్కడ కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి సైలెంట్ అయిపోయారు. ఏపీ సీఎం జగన్ లేఖ రాసి ఊరుకున్నారు. చంద్రబాబు అయితే ప్రతిపక్షంలో ఉండడంతో ఆ భయానికే కేంద్రంతో అస్సలు పెట్టుకోవడం లేదు. దీంతో విశాఖ వాసులు ఎంత రోడ్డెక్కి ఆందోళన చేసినా ఏపీ పార్టీలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఎవరిది వారు గప్ చుప్ గా ఉండిపోతున్నారు. పక్క రాష్ట్రాల నేతలతో పోలిస్తే కనీసం సత్తా చూపలేని ఏపీ నేతల తీరు చూసి ప్రజలు కూడా నిట్టూరుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేతలను తాము గెలిపించుకున్నామా? అన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోందట..