Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలను పార్టీలన్నీ మోసం చేస్తున్నాయా?

By:  Tupaki Desk   |   22 Feb 2021 3:59 AM GMT
ఏపీ ప్రజలను పార్టీలన్నీ మోసం చేస్తున్నాయా?
X
కేంద్రంలో అధికారం ఉంది. కావాల్సినంత మెజార్టీ ఉంది. అందుకే మూడు నెలలుగా గడ్డకట్టే చలిలో రైతన్నలు సాగుచట్టాలకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నా కనీసం కనికరించలేదు బీజేపీ ప్రభుత్వం. మొదట్లో కాస్త గొంతెత్తిన తెలంగాణ సీఎం కేసీఆర్, దక్షిణాది రాష్ట్రాల నేతలు సహా అన్ని రాష్ట్రాల రాజకీయా పార్టీలను నోళ్లు మూయించి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గొంతెత్తున్న వారిని అరెస్ట్ లు చేయించి బీజేపీ దమనకాండను దేశంలో చేస్తోందన్న ఆరోపణలు మేధావుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేయడానికి ఇదేమీ రాచరికం కాదని హితవు పలుకుతున్నారు.

దేశంలోనే కాదు.. ఆంధ్రాకు కేంద్రంలోని బీజేపీ తీరని అన్యాయమే చేసింది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఎన్నో హామీలను విస్మరించింది. ఏపీలోని ఫ్యాక్టరీలను ప్రైవేటీకరిస్తోంది. ప్రత్యేక హోదాకు చరమగీతం పాడింది. విభజన హామీలను చెత్తబుట్టలో వేసింది.

ఇదే తెలంగాణలో చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రజలు, పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి కాసింతనైనా పోరాడేవారు.. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం ఆంధ్రా ప్రజలు చేసుకున్న దౌర్భగ్యమనే చెప్పొచ్చు.

ఏదైనా సమస్యపై పార్టీలు, ప్రజాసంఘాలు లీడ్ తీసుకుంటే.. ప్రజలు వాటిని ఫాలో అవుతారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు విభేదాలు మరిచి రాష్ట్ర సాధన కోసం ఏకమయ్యారు. రాజకీయ పార్టీలతో ఏర్పడిన జేఏసీ ఉద్యమాన్ని లక్ష్యం చేర్చింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కోసం కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. మొదట రాజీనామాలు చేసి హల్ చల్ చేసిన ఏపీ రాజకీయ నేతలు, పార్టీలన్నీ ఇప్పుడు మౌనముద్రవేశాయి.

అధికార వైసీపీకి కేంద్రంలోని బీజేపీ అంటే తీరని భయమా అన్న చర్చ సాగుతోంది.. ఆ పార్టీ నేతల మెడకు సీబీఐ, ఈడీ కేసుల ఉచ్చు ఉండడంతో ఇలాంటి సమస్యలపై గట్టిగా గొంతెత్తడం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు.. లేఖలతో, పార్లమెంట్ లో వ్యతిరేకతతో పుండు మీద యాంటిమెంట్ పూయడం తప్పితే గట్టిగా కొట్లాడలేని పరిస్థితి వైసీపీది అంటున్నారు..

ఇక ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మరో భయం. ఇప్పటికే అధికారం కోల్పోయిన పార్టీకి కేంద్రంతో పెట్టుకుంటే ఉన్న ప్రతిపక్ష స్థానంతోపాటు ఆ పార్టీ అధినేత భవిష్యత్ కూడా గందరగోళంలో పడుతుంది. అందుకే ఆయనా మౌనం దాల్చారని అంటున్నారు.

అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. విభజన హామీలు నెరవేర్చుకున్నా.. విశాఖ స్టీల్ కంపెనీని అమ్ముకుంటున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాడలేని దుస్థితి ఏపీ రాజకీయ పార్టీలది.. వీరందరూ కేంద్రానికి భయపడి ఇప్పుడు ఏపీ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. వీరు మారెదన్నడూ.. ఏపీ ప్రజల తలరాత మారేది ఎప్పుడనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న..