ఏపీలో 10వేల ఉద్యోగాలు పోతున్నాయా?

Mon Sep 13 2021 09:47:23 GMT+0530 (IST)

Are 10 thousand jobs being lost in AP?

ఏపీ ప్రభుత్వం మీద సరికొత్త ప్రచారం మొదలైంది. తమ ప్రభుత్వం కొలువు తీరితే.. భారీగా కొలువులు కల్పిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం.. జగన్ ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉందని.. ఆయన ప్రభుత్వ నిర్ణయం కారణంగా తాజాగా పది వేల ఉద్యోగాలు మాయం కానున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ.. ఈ ఆరోపణల్లో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.వేలాది ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఎయిడెడ్ విలీన నిర్ణయం ఉందని చెబుతున్నారు. ఎయిడెడ్ లెక్చరర్లు ప్రభుత్వంలో విలీనం కావాల్సిందేనని తీసుకొచ్చిన ఆదేశాలతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సెలవు రోజుల్లో రిపోర్టు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. వారందరిని దాదాపుగా విలీనం చేసేసుకున్నట్లు చెబుతున్నారు. మరో వారంలో మిగిలిన ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్ని కూడా విలీనం చేసుకుంటారని చెబుతున్నారు.

దీంతో ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చే వారి సంఖ్య ఎనిమిది వేల వరకు ఉంటుందని.. దీంతో ఆ పోస్టుల్ని ఇప్పట్లో భర్తీ చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎయిడెడ్ విలీనం పేరుతో తొలివిడతలో పది వేల లెక్చరర్లు.. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా ప్లాన్ డిసైడ్ చేశారు.

గతంలో దాతలు దానంగా ఇచ్చిన ఆస్తులతో ఎయిడెడ్ విద్యా సంస్థల్ని స్థాపించటం తెలిసిందే. వాటి నిర్వాహణ కోసం భూములు.. భవనాలు.. ఆస్తుల్ని పలువురు ఇచ్చారు. ఈ ఎయిడెడ్ కళాశాలల్లోని ఉపాధ్యాయులు.. లెక్చరర్లకు ఇప్పటివరకు ప్రభుత్వమే జీతాల్ని చెల్లిస్తోంది. అయితే.. ఈ విద్యా సంస్థల నిర్వాహణ భారంగా మారిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగ్గా.. అందుకు ఓకే చెప్పింది.

ఇంతకాలం జీతాలు ఇస్తున్న వారందరికి ప్రభుత్వమే కాబట్టి.. ఇప్పుడు వారిని విలీనం చేసుకోవటం ద్వారా ఖజానాకు ప్రత్యేకంగా భారం పడటం అనేది ఉండదు. కానీ.. ప్రభుత్వంలోకి వేలాది మంది టీచర్లు వచ్చేయటం వల్ల.. కొత్త డీఎస్సీలు.. లెక్చరర్ల భర్తీ అనేది దాదాపు ఉండదన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. కొత్తగా ఉద్యోగాలు వస్తాయని భావించిన యువతకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు ఇంతకాలం సెమీ సర్కారులో పని చేసిన అధ్యాపకులకు.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. సంతోషాన్ని ఇస్తుందని చెప్పాలి. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త డీఎస్సీని నిర్వహిస్తే మాత్రం.. ఇప్పటి ఆగ్రహం మాయం కావటం ఖాయమని చెప్పక తప్పదు.