అర్చనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదు.. కంగనాకు పద్మశ్రీ ఇవ్వొచ్చా?

Mon Jan 17 2022 16:03:57 GMT+0530 (IST)

Archana Gautam In UP Elections

ఇప్పుడో దరిద్రపుగొట్టు వాదనను వినిపిస్తున్నారు బీజేపీ నేతలు. హిందుత్వవాదులు. రాజకీయ ప్రయోజనాల కోసం తెర మీదకు తీసుకొచ్చే ఈ వాదనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ రాజకీయం అందరిని ఆకర్షిస్తోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం ఏ పార్టీకి వస్తుందన్న దానిపై భవిష్యత్తు దేశ రాజకీయాలు నిలుస్తాయనటంలో సందేహం లేదు. ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం అభ్యర్థుల్ని ప్రకటించటంలో తలమునకలై ఉన్నాయి.ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో  ప్రముఖ మోడల్.. నటి అర్చనాగౌతమ్ పేరును ప్రకటించటంపై  బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. చౌకబారు ప్రచారాల కోసమే అర్చనా లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లుగాబీజేపీ నేత రాకుశ్ త్రిపాఠి మండిపడుతున్నారు. ఆమెకు టికెట్ కేటాయించటంలో ప్రజాసేవ అనే భావన లేదంటూ ఆయన వినిపిస్తున్న వాదన వింతగా.. విచిత్రంగా ఉందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. బీజేపీ నేతకు తోడు పోయిన చందంగా అఖిల భారత హిందూ మహాసభ.. సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మాటలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి.

అర్థనగ్నంగా ఫోటోల్ని పోస్టు చేసే ఈ మహిళ వ్యవహార తీరువల్ల.. హస్తినా పుర్ లాంటి పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదు. పవిత్రమైన ప్రాంతం.. అపవిత్రమైన ప్రాంతాలు అంటూ ఏమీ ఉండవు. ఇక.. అర్థనగ్న ఫోటోల్ని పోస్టు చేసిందని.. అదో దుర్మార్గమైన చర్యగా భావించే వారు.. మోడీ సర్కారు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ఫోటోల మాటలేంటి? సినిమాల్లోని పాత్రలు నటించటం వేరు.. ఒక మ్యాగ్ జైన్ కోసం ఆ మధ్యన చేసిన ఫోటో షూట్ పెను సంచలనంగా మారటం తెలిసిందే.

మరి.. అర్థనగ్నానికి మించినట్లుగా ఉన్న ఫోటోలతో వెర్రెక్కించే కంగనాకు పద్మపురస్కారం మీద ఇదే హిందూ మహా సభ కానీ.. సంత్ మహాసభల అధినేతలు ఎందుకు నోరు విప్పలేదు. కాంగ్రెస్ చేసే ప్రతి పనిలోనూ తప్పుల్ని ఎత్తి చూపాలన్న తీరు ఏ మాత్రం సరికాదనే చెప్పాలి. అయినా.. రౌడీలు.. గూండాలు.. హత్యా నేరాలు.. అత్యాచార ఆరోపణలు ఉన్న 'మగమహారాజులు' ఎన్నికల బరిలో నిలిచినప్పుడు లేని ప్రజాసేవ భావన.. ఒక మోడల్.. నటి విషయంలో మాట్లాడటం చూస్తే.. తాలిబన్ తరహాలో ఆలోచిస్తున్నామన్న భావన కలగట్లేదు? ఇలాంటి వాదనల్ని మొగ్గలోనే తుంచేయటం మంచిది. లేనిపక్షంలో.. దారుణ పరిణామాల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది.