Begin typing your search above and press return to search.

అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు .. ప్రత్యేకత ఇదే !

By:  Tupaki Desk   |   16 Sep 2021 4:30 PM GMT
అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు .. ప్రత్యేకత ఇదే !
X
అంతరిక్ష పర్యాటకాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షంలోకి వ్యోమ నౌకలను పంపించాయి. ఈ జాబితాలో స్పేస్‌ ఎక్స్ సైతం చేరనుంది. సెప్టెంబర్ 15న (భార త్‌లో సెప్టెంబర్ 16 తెల్లవారుజామున) నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి నలుగురు వ్యోమగాముల బృదం అంతరిక్ష యాత్ర చేపట్టడానికి బయలుదేరనున్నారు. ఇన్‌ స్పిరేషన్ 4 మిషన్‌లో భాగంగా అమెరికన్ బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌ మన్ నేతృత్వంలోని మొత్తం నలుగురు పౌరుల బృందం అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు.

ఎలాన్ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్ కంపెనీ నిర్మించిన రాకెట్‌ లో వీరు భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్‌’కు వెళ్లనున్నారు. ఇది గతంలో ఇద్దరు బిలియనీర్లు జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లిన దూరం కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. స్పేస్‌ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్. అంతరిక్షంలోకి 575 కిలోమీటర్ల ఎత్తుకు నలుగురు వ్యక్తులను తీసుకెళ్లనుంది. ఇన్‌ స్పిరేషన్‌ 4 పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు సాధారణ పౌరులను స్పేస్‌ ఎక్స్‌ నింగిలోకి పంపనుంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ స్పేస్ టెలిస్కోప్ పరిధి దాటి మరింత ఎత్తుకు వెళ్లనుంది.

ఐఎస్‌ ఎస్‌ భూమికి 400 కిలోమీటర్లు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ 560 కిమీల ఎత్తులో ఉంది. నింగిలోకి దూసుకెళ్లే నలుగురు సిబ్బంది భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్’ కు వెళ్లనున్నారు. ఇది భూమి నుంచి సుమారు 2000 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రపంచ దేశాలు ప్రయోగించే శాటిలైట్‌ లు చాలా వరకు ఈ కక్ష్యలోనే ఉంటాయి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేర్ మిషన్ల తరువాత భూమి నుంచి ఎక్కువ ఎత్తుకు చేరుకోనున్న వ్యక్తులు వీరే కావడం విశేషం. మూడు రోజుల అనంతరం వ్యోమగాములు తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్‌4పేమెంట్స్‌’ కంపెనీ సీఈవో జేర్డ్‌ ఐసాక్‌ మాన్‌ భరిస్తున్నారు. ఐజాక్‌ మాన్ భారీ ఖర్చుతో ఈ ఫ్లైట్‌ ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా 100 మిలియన్ డాలర్లను ఈ ఇన్‌ స్టిట్యూట్‌కి డొనేట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత నలుగురు సభ్యుల బృందం ఆరోగ్య పరిశోధనల కోసం డేటా సైతం సేకరించనున్నారు. మానవ శరీరంపై అంతరిక్ష ప్రయాణం ప్రభావం గురించి తెలుసుకోవడానికి రిసెర్చ్ గ్రేడ్ ECG యాక్టివిటీ, మూవ్‌మెంట్, నిద్ర, హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, క్యాబిన్ నాయిస్, కాంతి తీవ్రత.. వంటి వివరాలను వారు సేకరించనున్నారు. స్పేస్‌ ఎక్స్ సంస్థ రూపొందించిన అతిపెద్ద ఫాల్కన్ 9 రాకెట్‌.. రిసైలెన్స్ క్యాప్సూల్‌ ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ అనేది రిఫ్లైట్ చేయగల మొదటి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అని స్పేస్‌ ఎక్స్‌ చెబుతోంది. భూమి కక్ష్యలోకి, కక్ష్యను దాటి మనుషులను తీసుకెళ్లగలదని, పేలోడ్‌ లను రవాణా చేయగలదని ఆ సంస్థ వెల్లడించింది.

ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వారిని అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో జేర్డ్ ఇసాక్‌ మన్, పైలెట్ సియాన్ ప్రొక్టార్, మెడికల్ ఆఫీసర్ హేలీ ఆర్సెనియాక్స్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్ సెంబ్రోస్కి ఉన్నారు. జేర్డ్ ఇసాక్‌ మన్ ఈ రాకెట్ కమాండర్‌ గా వ్యవహరిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి 585 కిలోమీటర్ల ఎత్తున సర్కులర్ ఆర్బిట్‌ లోకి డ్రాగన్ ఫాల్కన్ 9 రాకెట్ రెండో దశ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అయిన ఖర్చును ఇసాక్‌ మన్ భరించారు. అది ఎంత అనేది తెలియరావట్లేదు. దాన్ని వెల్లడించడానికి అటు ఇసాక్‌ మన్ గానీ, స్పేస్ ఎక్స్ కంపెనీ మేనేజ్‌ మెంట్ గానీ ఇష్టపడట్లేదు.