Begin typing your search above and press return to search.

హ్యాకింగ్ లో కేరళ కుర్రోడి దెబ్బకు భారీ రివార్డ్ ఇచ్చిన యాపిల్

By:  Tupaki Desk   |   23 Jun 2022 11:30 PM GMT
హ్యాకింగ్ లో కేరళ కుర్రోడి దెబ్బకు భారీ రివార్డ్ ఇచ్చిన యాపిల్
X
టెక్ కంపెనీలు ఎంత సెక్యూరిటీ ఉన్నామని చెబుతున్నా తెలివైన హ్యాకర్లు అందులోని లూప్ హోల్స్ ను వెతుకుతూనే ఉంటారు. అలా వెతికిన వారికి టెక్ కంపెనీలు భారీ నజరానాలు ఇస్తుంటాయి. తద్వారా తమ సమస్యను పరిష్కరించుకుంటాయి. టెక్ కంపెనీల్లోని డిజిటల్ సర్వీసెస్ లో సాంకేతిక సమస్యలను కనిపెట్టి ఎందరో ఎథికల్ హ్యాకర్లు లక్షల రూపాయలు , పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంటారు.

తాజాగా కేరళకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ స్టూడెంట్ కేఎస్ అనంతకృష్ణన్ ఏకంగా ప్రపంచంలోనే నంబర్ 1 టెక్ దిగ్గజం యాపిల్ లూప్ హోల్ ను కనిపెట్టాడు. యాపిల్ ఐక్లౌడ్ సర్వర్ లో కీలకమైన సెక్యూరిటీ లోపం సమస్యను గుర్తించగలిగాడు. దీంతో అతడికి టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ లో మెంబర్ షిప్ అందించింది. అంతేకాదు 2500 డాలర్లను బహుమతిగా అందించింది.

కేరళలోని అలప్పుజా జిల్లా మంకొంబు గ్రామానికి చెందిన కేఎస్ అనంత్ కృష్ణన్ తన 12వ తరగతి నుంచే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడి అద్భుత ప్రతిభ చూసి కేరళ పోలీసులు తమ సైబర్ డోమ్ లో ఒక సభ్యుడిగా కూడా చేర్చుకున్నారు.

ఇంటర్ పూర్తయ్యాక అనంత్ కృష్ణన్ కంప్యూటర్ సైన్స్ పై మక్కువతో బీటెక్ కోర్సులో చేరాడు. ప్రస్తుతం పతనంతిట్టలోని మౌంట్ జియోన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

ఈక్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కు సంబంధించిన ఐక్లౌడ్ సర్వర్ లో కీలకమైన సెక్యూరిటీ లోపాన్ని గుర్తించాడు. అనంతరం ఈ సమస్య వల్ల యూజర్లకు పెద్ద ముప్పు ఉందని చెబుతూ యాపిల్ ఇంజినీర్లకు సమాచారం అందించాడు. అది నిజమేనని తెలుసుకున్న యాపిల్ కంపెనీ ఇంజినీర్లు తక్షణమే దాన్ని సరిచేశారు.

ఈ లోపంతో ఐక్లౌడ్ ఈమెయిల్ యూజర్లు సెక్యూరిటీ రిస్క్ లో పడే అవకాశం ఉంది. ఈ టెక్నికల్ ఎర్రర్ ఫిక్స్ చేసినా కొత్త యూజర్లకు మాత్రమే రిస్క్ తగ్గుతుందని.. పాత ఖాతాదారులకు ఇప్పటికీ రిస్క్ పొంచి ఉందని మళ్లీ అనంతకృష్ణన్ తెలియజేశాడు.

కాగా ప్రస్తుతం పాత అకౌంట్స్ కు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కంపెనీ ఇంజినీర్లు అన్ని సమస్యలను సాల్వ్ చేస్తున్నారు. ఈ మేజర్ సెక్యూరిటీ ఫ్లా గుర్తించినందుకు అనంతకృష్ణన్ కు హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్ షిప్ ఇవ్వడంతోపాటు 2500 డాలర్ల నగదును బహుమతిగా యాపిల్ అందించింది.

ఇప్పటికే అనంతకృష్ణ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ లోనూ సమస్యలు కనిపెట్టాడు. అలాగే ఫేస్ బుక్, గిట్ హాట్ కంపెనీలలో కూడా కనిపెట్టి హాల్ ఆప్ ఫేమ్ మెంబర్ షిప్ గెలుచుకున్నాడు. ఇక అనంతకృష్ణన్ టాలెంట్ చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు.