చైనాకు మరో షాక్: 4500 మొబైల్ గేమ్స్ తొలగింపు

Mon Jul 06 2020 08:00:01 GMT+0530 (IST)

Apple Pulled Out 4500 Games From Chinese App Store

సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో భారతదేశం చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ మాదిరి డిజిటల్ స్ట్రైక్స్ అమలుచేసింది. అందులో భాగంగా 59 యాప్స్ తొలగించిన విషయం తెలిసిందే. ఇలాంటిదే తాజాగా చైనాకు దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదంతా గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించింది. ఈ నిర్ణయంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలకు యాపిల్ కంపెనీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చైనా గేమ్స్‌ను తొలగించినట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే ఇది అకస్మాత్తుగా తీసుకున్న చర్య కాదని లైసెన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గతేడాదే ప్రకటించినట్లు గుర్తుచేసింది. ఆ క్రమంలోనే ముందుగా విధించిన గడువు ప్రకారం జూన్ 30వ తేదీ నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్ నుంచి తొలగిస్తున్నట్లు యాపిల్ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. లైసెన్స్ నిబంధనలను పునరుద్ధరించిన అనంతరం చట్ట ప్రకారం అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయంతో చైనా కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.