జగన్ న్యాయం.. అవినాష్ బాటలోనే వంశీకా?

Thu Nov 21 2019 16:54:55 GMT+0530 (IST)

Ap cm ys jagan mohan reddy gives key post to devineni Avinash

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసబాట పట్టిన నేతలకు న్యాయం జరుగుతోంది. ఇటీవలే వైసీపీలో చేరిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ జిల్లాకు చెందిన ప్రముఖ కమ్మ యువనేత అవినాష్ కు జగన్ అనుకున్నట్టే కీలక పదవి కట్టబెట్టాడు.తెలుగుదేశం పార్టీలో ఉండగా దేవినేని అవినాష్ పట్టుపట్టి కోరినా ఆ పోస్టును చంద్రబాబు ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీలో అదే పోస్టును వైసీపీ అధ్యక్షుడు జగన్ కట్టబెట్టారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇన్ చార్జిగా అవినాష్ ను జగన్ నియమించారు. గతంలో దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్నే ఆయనకు జగన్ కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా అవినాష్ హాట్ కామెంట్ చేశారు. ‘నమ్ముకున్న నాయకుడికి న్యాయం చేసిన  నేత జగన్ అని.. హామీలు ఇచ్చి మోసం చేసిన వారు నిజమైన నాయకుడు కాడని చంద్రబాబు గురించి అవినాష్ కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో దేవినేని కుటుంబానికి భారీ ఫాలోయింగ్ ఉంది. నేతలు కార్యకర్తల బలం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచే పోటీచేయాలని అవినాష్ భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అదే సీటు ఇవ్వాలని చివరి వరకు పట్టుబట్టారు. కానీ చంద్రబాబు అప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న బలమైన టీడీపీ నేత గద్దె రామ్మోహన్ కే టికెట్ కేటాయించారు. దేవినేని అవినాష్ కు గుడివాడ టికెట్ ఇచ్చారు. కానీ బలవంతంగా  అవినాష్ ను మార్చినా ఫలితం దక్కలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బలమైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేతిలో దేవినేని అవినాష్ కు ఓటమి తప్పలేదు. ఓడిపోయే సీటు చంద్రబాబు ఇచ్చాడని అవినాష్ రగిలిపోయాడు. దీంతో టీడీపీకి దూరం జరిగారు. వైసీపీలోకి మారడానికి సరైన సమయం చూసి జంప్ అయ్యారు.

దేవినేని అవినాష్ కు కోరుకున్న పదవి ఇచ్చిన జగన్ ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి ఎలాంటి బాధ్యత అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. వంశీ టీడీపీకి మాత్రమే రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి చేయలేదు. అధికారికంగా వైసీపీలో చేరలేదు. స్వతంత్రుడిగానే ఉంటున్నారు. వైసీపీలో చేరితే ఆయన కోసం ఏదో పదవిని రెడీ చేయాల్సి ఉంటుంది.