Begin typing your search above and press return to search.

పొత్తుల మీద బీజేపీ కీలక నిర్ణయం ..భీమవరంలో గరం గరం రాజకీయం

By:  Tupaki Desk   |   24 Jan 2023 6:00 AM GMT
పొత్తుల మీద బీజేపీ కీలక నిర్ణయం ..భీమవరంలో గరం గరం రాజకీయం
X
ఏపీలో పొత్తుల కధకు ఎండ్ కార్డు వేయడానికి బీజేపీ చూస్తోందా. లేక కొత్త ఎత్తులకు నాంది పలకబోతోందా. ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి తేల్చడం ఖాయమని అంటున్నారు. భీమవరంలో ఈ నెల 24, 25 తేదీలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న వేళ సాగుతున్న ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. భీమవరంలో బీజేపీ కార్యవర్గ సమావేశాల మీద అటు తెలుగుదేశం, ఇటు జనసేన కూడా ఫోకస్ పెట్టి ఉంచాయని అంటున్నారు.

ఏపీలో జనసేన ఇపుడు పొత్తుల్లో ఉంది. జనసేనతో ఆ పార్టీ 2020 జనవరి నెలలోనే పొత్తు కుదుర్చుకుంది. పేరుకు పొత్తు అన్న మాట తప్పించి రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం పెరగలేదు, ఉమ్మడి కార్యాచరణ కానీ, పోరాటాలు కానీ ఎక్కడా జరిగిన దాఖలాలు అయితే లేవు. దానికి తోడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు.

ఇక ఈ మధ్య చంద్రబాబు ఇంటికి పవన్ స్వయంగా వెళ్ళి రెండున్నర గంటల పాటు మాటా మంతీ సాగించి వచ్చారు. దాంతో అనధికారికంగా పొత్తులు కుదిరాయని అంతా భావిస్తున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ ఈ పొత్తుల మీద అనౌన్స్మెంట్ ఇవ్వడమే తరువాయి అని అంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి మాత్రం జనసేన వైఖరి నచ్చడంలేదు అంటున్నారు. తమతో పొత్తులలో ఉంటూ తెలుగుదేశం వైపు వెళ్లడం ఏంటి అని కూడా వారు మండుతున్నారు.

అయితే బీజేపీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గౌరవప్రదమైన తీరులో సాధించాలని కోరుతున్న వారూ ఉన్నారు. పొత్తులు వద్దు ఒంటరిగానే పోరాడాలి అని అన్న వారూ ఉన్నారు. ఈ రెండు వర్గాల అభిప్రాయం ఎలా ఉన్నా హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నది తెలిసిందే. ఇక భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులు వస్తారని అంటున్నారు.

వారికి తమ మనోగతాన్ని అభిప్రాయాలను బీజేపీలోని రెండు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాలు అన్నీ కలసి కట్టుగా పోటీ చేయాలని అంటున్నారు. అలా కనుక చేస్తే వైసీపీ ఓడుతుంది అని అంటున్నారు. దాంతో టీడీపీ జనసేనలతో బీజేపీ కూడా వచ్చి చేరుతుంది అని ఆశిస్తున్నారు. అయితే అదంత ఈజీ కాదు అని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలుగుదేశం మీద విశ్వాసం లేదని అంటున్న వారూ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ పొత్తుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేందుకు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉపయోగపడతాయని అంటున్నారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నా ఇప్పటి నుంచే పార్టీని సన్నద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి తేలుస్తారు అని అంటున్నారు. ఇక బీజేపీ డెసిషన్ ఏంటో చూసిన తరువాత ఏపీలో మహా కూటమి కోసం కృషి చేతున్న తెలుగుదేశం జనసేనలు తమ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని డిజైన్ చేసుకుంటాయి అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలలో కీలక మార్పులకు బీజేపీ మీటింగ్ ఒక దారి చూపుతుందని అంటున్నారు. మరి బీజేపీ ఇంతకీ తేల్చేది ఏంటి అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.