Begin typing your search above and press return to search.

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట !

By:  Tupaki Desk   |   2 Jun 2020 9:10 AM GMT
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట !
X
ఈ మధ్య వరుసగా ఏపీ ప్రభుత్వానికి దురుదెబ్బలు తగులుతున్నాయి. సచివాలయాలకు రంగుల నుంచి మొదలుకొని నిమ్మగడ్డ ఇష్యూ వరకు..ఇలా ప్రతి విషయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. అయితే, ఎట్టకేలకి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు తీర్పు వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధార, వాస్తవదూరమైన, తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్ధల విషయంలో కావడంతో ఇప్పుడు సర్కారు ఆనందానికి అవధుల్లేవు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఇప్పుడు ప్రభుత్వంపై వార్తలు రాసే విషయంలో మీడియా సంస్ధలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్దితి.

మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 విషయంలో సీఎం జగన్‌కు ఊరట లభించింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తప్పుబట్టింది. ఇందులో న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. . పత్రికా స్వేచ్ఛను హరించేందుకు, మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఈ జీవో తీసుకు రాలేదని.. మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రజలకు చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న ప్రభుత్వ తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది. మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు లోబడే వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు గత ఏడాది డిసెంబరులో జీవో 2430ను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో ప్రకారం ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను ప్రసారం చేసే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేస్తారు. ఐతే ఆ జీవోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ , ఇప్పుడు హైకోర్టు కూడా సమర్థించడంతో జగన్ సర్కార్‌ కు ఊరట లభించినట్లయింది.