Begin typing your search above and press return to search.

కరోనా విలయం: కేంద్రంపై సుప్రీం, ఏపీ పై హైకోర్టు ఆగ్రహం !

By:  Tupaki Desk   |   22 April 2021 9:49 AM GMT
కరోనా విలయం: కేంద్రంపై సుప్రీం, ఏపీ పై హైకోర్టు ఆగ్రహం !
X
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల పై ఏపీప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవటంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అలాగే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల పై ఈనెల 26లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రాధాన్యతా అంశాన్ని పట్టించుకోకపోవటం పై ఫైర్ అయ్యింది. ఏపీలో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో పొందుపరచాలని చెప్పారు. మరోవైపు రెమిడీ ఫీవర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌ లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని , ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఇదిలా ఉంటే .. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నాలుగు అంశాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్న ప్రధాన న్యామయూర్తి బాబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం.. రేపటిలోగా కరోనాకు సంబంధించిన జాతీయ విధానం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సినేషన్‌ వంటి కరోనా అత్యవసరాల సరాఫరాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా కట్టడికి సంసిద్ధత ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రాలకు మినీ లాక్ ‌డౌన్‌ ప్రకటించే అధికారం ఇవ్వాలని స్పష్టం చేసింది. లాక్‌ డౌన్‌ విధించే హక్కు రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాని కోర్టు తెలిపింది. అయితే ఉత్తరప్రదేశ్‌ లోని పలు నగరాల్లో లాక్‌ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది.