వలంటీర్లకు పురస్కారాలు.. ఐక్యరాజ్యసమితి సహకారంతో ముందుకుః సీఎం జగన్

Tue Feb 23 2021 10:00:01 GMT+0530 (IST)

Ap Cm Ys Jagan Praises Volunteers

ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వలంటీర్లను గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. సచివాలయాల్లోని వలంటీర్లు అందరినీ సముచితంగా సత్కరించాలని తగిన రీతిలో పురస్కారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఉగాది పండుగ రోజునే వలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అత్యున్నత సేవ అందిస్తున్న వారిని సేవారత్న సేవామిత్ర వంటి బిరుదులతో సత్కరించాలన్నారు. రాష్ట్రప్రణాళిక శాఖపై తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు సీఎం.అదేవిధంగా.. వలంటీర్ వ్యవస్థను మరింతగా ఆధునీకరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు జగన్. గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తం వలంటీర్ల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేల పరిధిలోని  ఇ-క్రాపింగ్ సేవలు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని అన్ని ఇంటర్నెట్ సర్వీసు సేవలు వలంటీర్ల పర్యవేక్షణలో కొనసాగుతాయన్నారు.దీనివల్ల పాలన సమర్థవంతంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

అంతేకాదు.. ఈ వలంటీర్ల వ్యవస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాలతోపాటు ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ యునెస్కోలాంటి సంస్థల సహకారంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించడం విశేషం. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను సాధించేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని సీఎం చెప్పారు.

కాగా.. ఏపీలో వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా.. ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పనిచేస్తోందని ఆరోపించారు. అదే రోజున ముఖ్యమంత్రి వలంటీర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.