Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంత్ బాబుకు హత్య కేసు నుంచి విముక్తి లభించదా?

By:  Tupaki Desk   |   2 July 2022 2:58 AM GMT
ఎమ్మెల్సీ అనంత్ బాబుకు హత్య కేసు నుంచి విముక్తి లభించదా?
X
కాకినాడలో త‌న మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌​ను ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. జూలై 1తో అనంత్‌బాబు రిమాండ్​ ముగియడంతో పోలీసులు ఎస్కార్ట్​ సాయంతో ఆయన్ను రాజ‌మండ్రి కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. ఆయ‌న బెయిల్ పిటిష‌న్ ను కోర్టు గ‌తంలో ర‌ద్దు చేసింది. ఇప్ప‌టికే రెండుసార్లు అనంత్ బాబు బెయిల్ పిటిష‌న్ ను కొట్టేయ‌డం గ‌మ‌నార్హం.

విచారణ అనంతరం రిమాండ్​ ను మ‌రో 14 రోజులు పెంచడంతో అనంత్ బాబు తిరిగి రాజమండ్రి సెంట్ర‌ల్ జైలుకు తరలించారు. త‌న‌ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను.. జూన్ 17న కోర్టు కొట్టి వేసిన సంగ‌తి తెలిసిందే. ఆయన బెయిల్ కు కావాల్సిన అంశాల‌ను ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాది స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో బెయిల్ పిటిష‌న్ ను కొట్టేసింది. బెయిల్ పొందడానికి సరైన కారణాలను చూపడంలో అనంత్ బాబు న్యాయవాది విఫలమయ్యారని.. అందుకే అతడి పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి అప్పుడు వెల్లడించారు. కేసులో విచారణ పూర్తి కాకపోవడం, అనంత్ బాబు బయటకొస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశముందన్న బాధితుల తరఫు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. బెయిల్ పిటిష‌న్ కొట్టేయ‌డంతో అనంత్ బాబు రిమాండ్ ను జూలై 1 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జూలై 1న మ‌రోమారు ఆయ‌న కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో కోర్టు మ‌రో రెండు వారాలు అనంత్ బాబు రిమాండ్ ను పొడిగించింది.

మ‌రోవైపు సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ స‌భ్యులు అనంత్ బాబుకు బెయిల్ ఇవ్వ‌ద్ద‌ని న్యాయ‌మూర్తిని విన్న‌వించారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ ను క‌ల‌సిన సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ల్లిదండ్రులు అనంత్ బాబును ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరారు. అంతేకాకుండా సీబీఐతో త‌న కుమారుడి హ‌త్య కేసును విచారించాల‌ని విన్న‌వించారు.

తన మాజీ డ్రైవర్‌ సుబ్ర‌హ్మ‌ణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్‌బాబు నిందితుడిగా ఉన్నాడు. ముందు సుబ్ర‌హ్మ‌ణ్యం ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పిన అనంత్‌బాబు.. సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ సభ్యులు, ద‌ళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.