Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో మరో ఇంట్రస్టింగ్ పేరు

By:  Tupaki Desk   |   25 July 2021 12:30 AM GMT
హుజూరాబాద్ లో మరో ఇంట్రస్టింగ్ పేరు
X
అధికార టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో రోజుకో కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. బహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ, కాబోయే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు పోటీగా కేసీయార్ చాలా పేర్లను పరిశీలిస్తున్నారట. మొదట్లో ఈటల మీదకు ఎస్సీ అభ్యర్ధిని పోటీచేయించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి అన్నారు. తాజాగా బీసీ నేత గెల్లు శ్రీనివాసయాదవ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ముందు ముందు ఇంకెన్ని పేర్లు వినిపిస్తాయో తెలీదు.

ఒకటి మాత్రం నిజం కేసీయార్ అనుమతి లేకుండా ఇన్నిపేర్లు ప్రచారంలోకి రావు. ఎందుకంటే కావాలని కేసీయారే కొన్ని పేర్లను కాయిన్ చేస్తుంటారు. ప్రత్యర్ధి పార్టీలను కన్ఫ్యూజ్ చేయటం, అయోమయానికి గురిచేసి చివరినిముషంలో ఎవరు ఊహించని అభ్యర్ధిని రంగంలోకి దింపటం సీఎంకు అలవాటే. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు దారుణంగా దెబ్బకొట్టిన విషయం కూడా అందరికీ అనుభవమే.

ముందుగా అనుకున్న ఎస్సీ సామాజికవర్గంలో బండ శ్రీనివాస్ తప్ప మరో గట్టి అభ్యర్ధి దొరకలేదట. అయినా దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లోనే అమలు చేస్తున్నపుడు ఇక ఎస్సీ అభ్యర్ధి కాకపోతే మాత్రం ఏమిటని కేసీయార్ అనుకున్నారట. ఎందుకంటే నియోజకవర్గంలో సుమారు 45 వేల దళిత ఓట్లున్నాయి. దళితబంధు పథకం అమలు చేయగానే మొత్తం దళిత ఓట్లన్నీ తమకే పడతాయన్నది కేసీయార్ ధీమాకాబోలు. అందుకనే రెడ్డి అభ్యర్ధంటు ప్రచారం జరిగింది.

ఇందుకనే కాంగ్రెస్ నేత కౌశిక్ ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారనే ప్రచారం నాలుగు రోజులు నడిచింది. అయితే కౌశిక్ కు కండువా కప్పిన సమయంలో నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయకుండా కౌశిక ను రాష్ట్రస్ధాయి నేతను చేస్తానని బహిరంగంగా చెప్పారు. కాబట్టి కౌశిక్ కూడా అభ్యర్ధికాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపధ్యంలోనే బీసీ నేతపైకి బీసీ నేతనే కేసీయార్ ప్రయోగించబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

ఈ నేపధ్యంలోనే గెల్లు శ్రీనివాసయాదవ్ పేరు హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చేసింది. ఎస్సీల తర్వాత నియోజకవర్గంలో బీసీల ఓట్లు కూడా బాగానే ఉన్నాయట. అయితే ఈటల ముందు గెల్లు పెద్దగా నిలవలేడనే ప్రచారం కూడా జరుగుతోంది. మరీ విషయం కేసీయార్ కు తెలీకుండానే ఉంటుందా ? పైగా రోజు సర్వేలు చేయించుకుంటున్నారు కూడా. ఇప్పటికి ముచ్చటగా మూడుపేర్లు వచ్చాయి. ముందు ముందు ఇంకెన్ని పేర్లు ప్రచారంలోకి వస్తాయో చూడాల్సిందే.